నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 12 : యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. అన్నదాతలు తెల్లారి లేచింది మొదలు తిండీతి ప్పలు మాని సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఓ వైపు పంట అదును దాటుతుండడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎరువు దొరకకపోవడంతో ఇదెక్కడి గోస.. అని కన్నీళ్లు పెడుతున్నారు. శుక్రవారం రాయపర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేసి కాంగ్రెస్ సర్కారుపై విరుచుకపడ్డారు. మరిపెడ, నెక్కొండలో ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూరియా కోసం రైతులు క్యూలు కట్ట డం ఆగడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సరిపడా అందించకపోవడంతో పీఏసీఎ స్లు, ఫర్టిలైజర్ షాపుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. శుక్రవారం మరిపెడలో యూరియా లేదని చెప్పడంతో ఆగ్రహించిన అన్నదాత ఖమ్మం-వరంగల్ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడిక్కడే అగిపోవడంతో సీఐ రాజ్‌కుమార్ గౌడ్, ఎస్సై బొలగాని సతీశ్‌గౌడ్ రైతులతో మాట్లాడి అందరికీ యూరియాను అందజేస్తామని, పురపాలక సంఘం కార్యాలయం లో కూపన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చా రు.
అనంతరం అక్కడికి వెళ్లగా ఈ రోజు యూరియా లేదు, రేపు కూపన్లు ఇస్తామని చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. నెక్కొండలోని రైతు వేదిక వద్ద యూరియా ఇస్తారని తెలిసి వందల సంఖ్య లో రైతులు కుటుంబంతో సహా లైనులో గంటల తరబడి వేచి ఉన్నారు. తీరా రావడం లేదని చెప్పడంతో వెళ్లిపోయారు. మళ్లీ మధ్యాహ్నం వ్యవసాయ మార్కెట్ వద్దకు వచ్చి గంటల తరబడి వేచి ఉన్నా యూరియా రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సకాలంలో యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.
రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో నెక్కొండ ఎస్సై మహేందర్ సిబ్బందితో వచ్చి రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేశారు. దేవరుప్పుల మండంలలోని కోలుకొండ గ్రా మంలో ఎరువుల దుకాణాల ముందు నిలబడ్డ రైతులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. తాము పొద్దున లేస్తే ఇంటిల్లి పాది ఎరువుల దుకాణాల చుట్టూ తిరగడమే సరిపోతుందని రైతులు వాపోయారు.
డోర్నకల్ మండలం గొల్లపల్లి సొసైటీ, గార్లలో మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, కురవి మండలం నేరెళ్ల, కేసముద్రంలో ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ యూరియా పంపిణీని పర్యవేక్షిం చారు. నర్సింహులపేట పీఏసీఎస్ గోదాంలో యూరియా బస్తాలు మోస్తున్న హమాలీలపై సీఐ శంకర్‌నాయక్ నోరు జారడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపు యూరియా బస్తాలు వేయకుండా నిలిపివేశారు. అనంతరం ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ వారిని ఆప్యాయంగా పలకరించి అన్నం పెట్టే రైతులకు అందరం కష్టకాలంలో తోడుగా ఉండాలని సూచించారు. దీంతో హమాలీలు నిరసన విరమించారు.