హనుమకొండ, మే 24 : నేటి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్-2025 పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటుచేసింది. ఆదివారం ఉదయం 9.30గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండు పూటలా నిర్వహించే ఈ పరీక్ష కోసం హనుమకొండ జిల్లాలో 10 కేంద్రాలు కేటాయించగా 4,141 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం పరీక్షకు 8గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9గంటల తర్వాత, మధ్యాహ్నం 2 తర్వాత అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, పెన్ను, పెన్సిల్‌తో పాటు అందులో పేరొన్న గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును వెంట తెచ్చుకోవాలి. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు. చేతి గడియారాలు కూడా అనుమతించరు. పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ ప్రకటనలో సూచించారు.
పరీక్షా కేంద్రాలివే..
హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సబ్ సెంటర్-ఎ, సబ్ సెంటర్ -బి, హంటర్‌రోడ్డులోని మాస్టర్జీ పీజీ అండ్ డిగ్రీ కళాశాల, న్యూసైన్స్ డిగ్రీ కళాశాల, అడ్వకేట్స్‌కాలనీ రోడ్డు నెంబర్-1 లోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, వడ్డెపల్లిలోని పింగిళి ప్రభుత్వ కళాశాల(మహిళలు), పెద్దపెండ్యాల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భద్రకాళీ ఆలయం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ములుగు రోడ్డులోని లాల్ బహుదుర్ కాలేజీ, అశోక థియేటర్ వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నారు.
సెంటర్ల వద్ద 163 సెక్షన్ అమలు : సీపీ సన్‌ప్రీత్‌సింగ్
సుబేదారి, మే 24 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించే యూ పీఎస్సీ సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5 వరకు బీఎన్ఎస్ఎస్-163 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రాలకు 500 మీటర్ల దూరంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలు, ఊరేగింపులకు అనుమతి లేదని, చుట్టుపక్కల ఉన్న ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.