హనుమకొండ, మే 3 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్‌రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దాస్యం మాట్లాడుతూ 2022 మే 6న ఆర్ట్స్ కళాశాల మైదానానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ పేరుతో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు ద్రోహం చేసిందన్నారు.
ఈ డిక్లరేషన్ ఒట్టి మోసమని, రెండున్నరేండ్లుగా 420 హామీలు, 6 గ్యారంటీల్లో ఏ ఒకటీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం వ్యవసాయాన్ని పండుగ చేసి దేశంలోనే తెలంగాణను కేసీఆర్ ఆదర్శంగా నిలిపారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదికలు నిరపయోగంగా మారాయన్నారు. రైతు భరోసాను ఎగ్గొట్టారని, బోనస్‌ను పక్కన పెడితే పండిన పంటను కూడా కాంగ్రెస్ సర్కార్ కొనుగోలు చేయడం లేదన్నారు. దగాపడ్డ తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. సదస్సు నిర్వహిస్తామంటే అనుమతి ఇవ్వని ప్రభుత్వం ఏ చేసిందని రైతు మేళాను పోటీగా ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రజలను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటిని గుర్తు చేసేందుకే రాహుల్ గాంధీ డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లో సదుస్సు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి రైతు సదస్సుకు మంచి స్పందన వస్తున్నదని, పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరు కానున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, కే వాసుదేవరెడ్డి, మెట్టు శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, నాయకులు పులి రజినీకాంత్, పోలపల్లి రామ్మూర్తి, హరి రమాదేవి, విద్యార్థి నాయకులు బైరపాక ప్రశాంత్, రాకేశ్‌యాదవ్, శరత్, వీరు తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎనుమాముల మార్కెట్‌కు బీఆర్ఎస్ బృందం
కాశీబుగ్గ, మే 3 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని మక్కల యార్డును సోమవారం బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొనుగోళ్ల తీరు, రైతులు పడుతున్న ఇబ్బందులు, దక్కుతున్న మద్దతు ధరను పరిశీలించనున్నారు.
హామీలపై చర్చకు సిద్ధం
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ చర్చకు సిద్ధం. కాం గ్రెస్ నాయకులు ఉమ్మడి జిల్లాలోని ఏ గ్రామానికి రమ్మన్నా వస్తాం. ఎరువులు, విత్తనాలు, సాగు, తాగు నీరు సకాలంలో అందించిన గొప్ప నేత కేసీఆర్. ఆయన నాయకత్వంలో వ్యవసాయం పండుగైతే.. నేడు సాగు దండగలా మారింది. విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతులకిచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వం.
– నాగుర్ల వెంకటేశ్వర్లు, రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్
డిక్లరేషన్ పేరుతో మోసం..
స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను పచ్చగా మార్చారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో విధ్వంసం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పోరాడుతుంది. రైతులకు న్యాయం చేసిన మహనీయుడు కేసీఆర్. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రైతులు సంగ్రామ సదస్సుకు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులంతా ఎనుమాముల మారెట్‌కు వెళ్తున్నాం. సదస్సు ద్వారా రైతులకు భరోసా ఇస్తాం.
– అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది
బీఆర్ఎస్ను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. కేసీఆర్ బయటకు వస్తే ఆందోళన చెందుతున్నది. పులిని చూసి నక వాతలు పెట్టుకున్నట్లుగా బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెడితే పోటీగా కాంగ్రెస్ రైతు మేళా నిర్వహిస్తున్నది. జగిత్యాలలో కేసీఆర్ సభ పెడితే భయపడి మంథని నియోజకవర్గంలో సభ పెట్టారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న రైతు మేళా ప్రజలను మోసం చేయడానికే. కాంగ్రెస్‌ది రైతు మేళా కాదు.. బ్యాండు మేళం. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు.. భవిష్యత్‌లో చేయదు. స్టేషన్ఘనపూర్ నియోజకర్గంలోని రైతుల పంటలను 20 శాతం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. రైతులు కర్రుకాల్చి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
– డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి