ములుగు రూరల్, ఆగస్టు 2 : ఏమైందో తెలియదు గానీ, ఇద్దరు విద్యార్థులు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఘటన ములుగు మండలం బండారుపల్లిలోని టీజీ గురుకుల పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గురుకులానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు కార్తీక్, ప్రణయ్ గంట వ్యవధిలోనే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. గురువారం రాత్రి ఇదే గురుకులానికి చెందిన 8వ తరగతి విద్యార్థి శ్రీకర్‌కు విషపురుగు కుట్టడంతో ములుగు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి వెళ్లినట్లు తెలిసింది.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున కార్తీక్, ప్రణయ్ కూడా అస్వస్థతకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయమై గురుకుల ఉపాధ్యాయులను వివరణ కోరగా.. ఇద్దరు విద్యార్థులు కండ్లు తిరిగి అస్వస్థతకు గురికావడంతో వెంటనే దవాఖానకు తీసుకెళ్లామని, తమకేమీ తెలియదన్నారు. చికిత్స అందించిన వైద్యులు మాత్రం మొదట విద్యార్థులు పాముకాటుకు గురై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసినా, వారి ఒంటిపై ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదన్నారు.
ప్రథమ చికిత్స అందించి వరంగల్ ఎంజీఎం దవాఖానకు రెఫర్ చేశారు. కాగా, ఈ విషయం ములుగు జిల్లా కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, కొన్ని రోజులుగా గురుకులంలోని విద్యార్థులకు డ్రగ్స్ అందుతున్నాయనే పుకారు షికార్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ తీసుకొని అస్వస్థతకు గురై ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాము కాటా లేక డ్రగ్స్ తీసుకున్నారా అనే విషయంలో వైద్యులు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. విద్యార్థులు స్పృహలో లేనందున అర్థం కాని పరిస్థితి ఉందని వైద్యులు చెబుతున్నారు.
ములుగు ప్రభుత్వ దవాఖానలో ప్రథమ చికిత్స అనంతరం ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానకు వైద్యులు రెఫర్ చేశారు. కానీ, ప్రిన్సిపాల్, మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వారిని గూడెప్పాడ్లోని ఎన్ఎస్ఆర్ ప్రైవేట్ దవాఖానకు తరలించినట్లు తెలిసింది. అక్కడ ఐసీయూలో వెంటిలేటర్లపై వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. విద్యార్థులను ఎంజీఎం దవాఖానకు తరలించకుండా ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.