కాజీపేట, అక్టోబర్ 9 : కాజీపేట పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 40 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. కాజీపేట చౌరస్తాలో ఆదివారం పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని స్టేషన్‌కు తరలించి వారి వద్ద ఉన్న రెండు బ్యాగులను తనిఖీ చేయగా, వాటిలో 40 కిలోల గంజాయి(2 కిలోల చొప్పున 20 బెండళ్లు) లభ్యమైంది. తరలిస్తున్న వారిని ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన టీటు పాలై, రేణు సామాల్గా గుర్తించాం.
కాగా, అదే రాష్ర్టానికి చెందిన కాలు వీరికి గంజాయి బ్యాగులను అప్పగించి సూరత్‌లోని మరో వ్యక్తికి అందజేయాలని చెప్పాడు. అతడితో రూ.16 వేలకు బేరం కుదుర్చుకుని వీరు సూరత్‌కు బయలు దేరారు. కాజీపేటలో రైలు మారేందుకు దిగి భోజనం చేసేందుకు చౌరస్తా ప్రాంతానికి రాగా, పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు.
గంజాయి రవాణా చేస్తున్న టీటు పాలై, రేణు సామాల్తో పాటు కాలు, సూరత్‌కు చెందిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న కాజీపేట ఏసీపీ డేవిడ్‌రాజ్, సీఐ సార్ల రాజు, టాస్క్‌ఫోర్స్ పోలీస్ సిబ్బందిని సీపీ ఏవీ రంగనాథ్, సెంట్రల్ జోన్ డీసీపీ బారి అభినందించారు. సమావేశంలో సీఐ సార్ల రాజు, ఎస్సై రవికుమార్, లలిత, పోలీస్ సిబ్బంది వాల్యా నాయక్, శ్రీనివాస్, సతీశ్‌రెడ్డి, రమేశ్, వేణు, భాస్కర్, కమలాకర్, విష్ణు పాల్గొన్నారు.