ఖానాపురం, డిసెంబర్ 21 : రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల దేశానికే తలమానికమని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని 125 గురుకుల పాఠశాలలకు చెందిన 1600 మంది విద్యార్థులు అశోక్‌నగర్ సైనిక్స్కూల్లో ప్రారంభమైన ఇథ్నోవ 2022 ఇగ్నైట్ ఫెస్ట్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం ప్రారంభించారు.
ముందుగా మంత్రి సత్యవతి రాథోడ్ సైనిక్ విద్యార్థులతో గాడ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఫొటో గ్యాలరీని ప్రారంభించి ఫొటోలను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులు నిర్వహించిన యూత్ పార్లమెంట్, ఫ్లోర్ ఆర్ట్‌ను పరిశీలించారు. విద్యార్థులను అసెంబ్లీకి తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదేవిధంగా తొలిరోజు నిర్వహించిన వ్యాసరచన, గ్రూప్ డ్యాన్సింగ్, స్పెల్ బీ, డిబేట్, షార్ట్ ఫిలిం, సైన్స్‌ఫేర్ (రొబోటిక్)ను గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 91 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవని అన్నారు. తెలంగాణ వచ్చిన 7 ఏండ్లలోనే సీఎం కేసీఆర్ ముందుచూపుతో 92 గురుకులాలను ఏర్పాటు చేశారని అన్నారు. మరో 3 గురుకులాలను మంజూరు చేసుకున్నామని వివరించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లోనూ తెలంగాణలో ఉన్న గురుకులాలు లేవన్నారు. గురుకుల పాఠశాలల్లో ఇంటిగ్రేటెడ్ లా కోర్సు, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫొటోగ్రఫీ కోర్సులు ఏర్పాటు చేశామని వివరించారు.
గతంలో సివిల్స్ కోచింగ్‌కు విద్యార్థులు ఢిల్లీ వెళ్లేవారని, వారి కోసం ఐఏఎస్ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. సైనిక్స్కూల్లో ప్రత్యేక మెనూ ఉందని, ఒక్కో విద్యార్థికి రూ.50 ఇస్తున్నామని వివరించారు. వారం రోజుల్లో డైట్ చార్జీలను 30 శాతం పెంచనున్నట్లు వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో సీటు లభిస్తే విద్యార్థుల స్థిరపడినట్లేనని తల్లిదండ్రులకు సమ్మకం కలిగిందని అన్నారు. ఈ ఏడాది 700 మంది విద్యార్థులు నీట్, ఐఐటీ, నిట్‌లో సీట్లు సాధించారని చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నందున సీట్ల సంఖ్య గతంలో కంటే పెరిగిందని అన్నారు. అశోక్‌నగర్ సైనిక్స్కూల్కు సీడీఎఫ్ నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. అదేవిధంగా అదనపు తరగతి గదులకు త్వరలోనే మంజూరు చేస్తానని, సైనిక్‌స్కూల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ సైనిక్ స్కూల్ మంజూరు చేశారు..
సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో అశోక్‌నగర్‌కు సైనిక్ స్కూల్‌ను మంజూరు చేశారని అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల నుంచి సైనిక్‌స్కూల్‌గా అప్‌గ్రేడ్ అయ్యాక ఇంటర్, డిగ్రీ కాలేజీలు మంజూరయ్యాయని అన్నారు. తాను నెలనెలా సైనిక్ స్కూల్ నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. పాఠశాలకు సీడీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షల మంజూరు చేస్తున్నానని, అదేవిధంగా అర కిలోమీటరు వరకు సీసీ రోడ్డు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇగ్నైట్ ఫెస్ట్‌ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని, మౌలిక వసతుల కల్పనలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ బీ గోపి, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఆర్సీవో వెంకన్న, డైరెక్టర్ శ్రీనివాసరావు, అదనపు డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, డీటీడీవో జహీరొద్దీన్, ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ సంపత్‌రావు, ఎంపీడీవో సుమనవాణి, సీఐ పులి రమేశ్, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్ కవిత తదితరులు పాల్గొన్నారు.