వరంగల్, ఫిబ్రవరి 26(నమస్తేతెలంగాణ) : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరిన్ని కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా పార్కులో మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నది. ఇప్పటికే రహదారులు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేసింది. ప్రస్తుతం వ్యర్థ జలాల శుద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. పార్కులో ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 85 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల టీఎస్ఐఐసీ టెండర్ ప్రక్రియ నిర్వహించగా, రాంకీ-ఎన్విరాన్ జాయింట్ వెంచర్ పనులను దక్కించుకున్నది. ఏడాదిలోపు ప్లాంట్ పూర్తి చేయాలని అధికారులు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. వస్త్ర నగరిలో ప్రస్తుతం సాయిల్ టెస్టింగ్ పనులు జరుగుతున్నట్లు టీఎస్ఐఐసీ వరంగల్ జోనల్ మేనేజర్ సంతోష్‌కుమార్ వెల్లడించారు.
పరిశ్రమల స్థాపనకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా వ్యర్థ జలాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.85 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీఎస్ఐఐసీ అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఈ టెండర్‌ను సంయుక్తంగా దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు కొద్దిరోజుల క్రితం అగ్రిమెంట్ కుదుర్చుకుని వ్యర్థజలాల ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాయి. గీసుగొండ మండలం శాయంపేట, సంగెం మండలం చింతలపల్లి గ్రామా ల శివారులో సుమారు 1,200 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే గణేశా ఎకోటెక్, ఎకోపెట్ పరిశ్రమలను నెలకొల్పింది. రెండు ప్లాంట్లను ని ర్మించింది. వీటిలో ఉత్పత్తి మొదలైన ఓ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ గత మే నెల 7న ప్రారంభించారు. అదే రోజు కేరళ రాష్ర్టానికి చెందిన కిటెక్స్ కంపెనీ వస్త్ర పరిశ్రమల స్థాపనకు భూమి పూజ చేశారు. ప్ర స్తుతం దీని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో సౌత్‌కొరియాకు చెందిన యంగ్వన్ కంపె నీ కూడా పరిశ్రమల నిర్మాణ పనులను మొదలుపెట్టే ఏర్పాట్లలో తలమునకలైంది. మరికొన్ని కంపె నీలు పరిశ్రమలను నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వస్త్రనగరి లో మౌలిక వసతులు కల్పించడంపై నజర్ పెట్టింది.
పనులకు శ్రీకారం..
మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 450 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రహదారులు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మించింది. పరిశ్రమల నిర్మాణ పనులు మొదలు కావడానికి తొలి విడుత ఇక్కడ 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించడంతో పాటు నీటి సరఫరా ఏర్పాట్లు చేసింది. మరో రూ.178 కోట్లతో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మా ణం చేపట్టింది. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు జెట్స్పీడ్తో సాగుతున్నాయి. గీసుగొండ సబ్‌స్టేషన్ నుంచి వస్త్రనగరి వరకు ఫీడర్ టవర్ లైన్ ఎరక్షన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో సబ్‌స్టేషన్ నుంచి ఇంకో ఫీడర్ టవర్ లైన్ ఎరక్షన్ పనులు కొనసాగుతున్నాయి. పార్కుకు మి షన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు రూ.100 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టింది. హనుమ కొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి గ్రా మం వద్ద ఉన్న చలివాగు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించాలని నిర్ణయించింది. కొద్ది నెలల నుంచి పైపులైన్ నిర్మాణ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. రోడ్డు, రైల్వేలైన్ కటింగ్ వంటివి ఈ పైపులైన్ నిర్మాణం కోసం చేయాల్సి ఉన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రభుత్వం మెగా పార్కులో వ్యర్థ జలాల శుద్ధీకరణ కేంద్రం నిర్మాణానికి రూ.85 కోట్లు మంజూరు చేసింది. టీఎస్ఐఐసీ అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహించగా, పనులు రాంకీ- ఎన్విరాన్(జాయింట్ వెంచర్)కు దక్కాయి. కొద్దిరోజుల క్రితం అగ్రిమెంట్ చేసుకుని ఈ సంస్థలు ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించాయి. ప్రస్తుతం సాయిల్ టెస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఏడాదిలోపు ఈ పనుతే పూర్తి చేయడానికి అగ్రిమెంట్ జరిగినట్లు టీఎస్ఐఐసీ వరంగల్ జోనల్ మేనేజర్ సంతోష్‌కుమార్ వెల్లడించారు.