‘మేం ఫలానా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మీ వాహనంపై చలాన్ పెండింగ్‌లో ఉంది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి డబ్బులు కట్టి వెళ్లండి’.. ఇది ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వాహనదారులకు వస్తున్న ఫోన్లు.. ఉన్నతాధికారుల ఆదేశమో.. ప్రభుత్వ ఖజానా నింపడమో కాని.. ఫోన్లలోనే వాహనదారులను ఒత్తిడికి గురిచేస్తూ.. స్టేషన్‌కు పిలిపించుకొని పెండింగ్ చలాన్లను క్లియర్ చేయించడం.. వినని వారికి పదే పదే ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేయడం విమర్శలకు దారితీస్తున్నది.
– సుబేదారి, ఆగస్టు 31
ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను కొత్త తరహాలో వేధిస్తున్నారు. బైక్, కారు, ఆటో తదితర వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉన్న వారికి ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని వెంటనే క్లియర్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. చేతికి పెండింగ్ చలాన్ల లిస్ట్ ఇచ్చి బలవంతపు వసూళ్లు చేపడుతున్నారు.
ఒకవేళ ఎవరైనా స్పందించకపోతే పదే పదే ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే రోడ్డు మీద వాహనం పట్టుకున్నప్పుడు అడగాలి కానీ, ఫోన్ చేసి మరీ పెండింగ్ చలాన్లు చెల్లించాలని పోలీసులు ఒత్తిడికి గురిచేయడం ఏమిటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పద్ధతి లేదని వాపోతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పెండింగ్ చలాన్లు కట్టకుంటే వాహనం సీజ్ చేస్తామని కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆగస్టు 20న సర్క్యులర్ జారీచేశారు.
వరంగల్ నగరంలోని కాజీపేట, వరంగల్, హనుమకొండ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 1,27,194 వాహనాలపై 11,71,094 చలాన్లు పెండింగ్‌లో ఉండగా రూ. 33.28 కోట్లు చెల్లించాల్సి ఉంది. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో మరో 2,01,451 చలాన్లు పెండింగ్ల్లో ఉన్నాయి. వీటి చెల్లింపుల కోసం రోడ్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నంబర్ ప్లేట్‌ను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి వాహనదారుడు ప్రయాణించే రోడ్డు మార్గంలో పట్టుకుంటామని సీపీ తెలిపారు.
అయితే ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా పెండింగ్ చలాన్లు వసూలు చేసేందుకు పూనుకున్నారు. కొద్ది రోజులుగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు వారి పరిధిలో చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి కట్టాలని ఒత్తిడికి గురిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం కాజీపేట ట్రాఫిక్ పోలీసులు తనకు ఫోన్ చేసి పెండింగ్ చలాన్ల డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు ఓ బాధితుడు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపాడు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారు ఖజానా నింపేందుకే పోలీసులు స్టేషన్లకు పిలిపించుకొని పెండింగ్ చలాన్లు వసూలు చేస్తున్నారని పలువురు వాహనదారులు విమర్శిస్తున్నారు.