సుబేదారి, ఏప్రిల్ 11 : పేద ప్రజలకు ప్రతినెలా ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. టన్నుల కొద్ది బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నది. ప్రస్తుతం ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండడంతో రేషన్ మాఫియా రెచ్చిపోతున్నది. నెల వారీగా రేషన్ షాపులు, కిరాణా షాపుల నుంచి, అక్కడక్కడా లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి బ్లాక్ మార్కెట్లోకి విక్రయిస్తున్నది.
ఈ సారి ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో పెద్దఎత్తున అక్రమ సంపాదనకు తెరలేపారు. టన్నుల కొద్ది, వందల బస్తాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, లారీల్లో లోడ్ చేసి బయటి రాష్ర్టాలకు తరలిస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే ఒకేసారి ఇస్తున్న 3 నెలల రేషన్ బియ్యాన్ని సేకరించి, టన్నుల కొద్ది బియ్యం బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు తెలుస్తున్నది. ఈ నెలలో నాలుగు రోజుల వ్యవధిలోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు రేషన్ మాఫియా డంపు చేసిన సుమారుగా రూ.20 లక్షలకు పైగా విలువచేసే టన్నుల కొద్ది బియ్యాన్ని పట్టుకోవడం గమనార్హం.
ఇక లా ఆర్డర్లో పనిచేస్తున్న కొందరు ఇన్స్పెక్టర్లు దళారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకొని అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దళారులు కిలో రేషన్ బియ్యాన్ని రూ. 8 నుంచి రూ.12 వరకు కొనుగోలు చేసి, ఆటోల ద్వారా శివారు ప్రాంతాలకు తరలించి, డంపింగ్ చేసి, అక్కడి నుంచి బయటి రాష్ర్టాలకు తరలిస్తున్నారు. స్టేషన్ల అధికారులకు రేషన్ దళారుల నుంచి నెలకు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాలో చాలామంది దళారులు ఉన్నారు. వీరిలో ప్రధానంగా వరంగల్ నగర శివారుకు చెందిన ఓ వ్యక్తి రేషన్ బియ్యం మాఫియాలో ఆరితేరాడు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరకాల, నడికూడ, ఆత్మకూరు, శాయంపేట, నర్సంపేట, వర్ధన్నపేట, జఫర్గడ్, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, దామెర, మడికొండ, మామునూరు, మిల్స్‌కాలనీ, హసన్‌పర్తి, కమాలపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, నగర శివారు గ్రామాల నుంచి రేషన్ డీలర్లు, కిరాణాషాపుల యజమానులు, లబ్ధిదారుల నుంచి అనుచరులతో తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆటోల ద్వారా సేఫ్‌జోన్ ప్రాంతాలు వెంచర్లు, స్టోన్ క్రషర్స్, రహస్య ప్రదేశాల్లో డంపింగ్ చేయడం, అక్కడి నుంచి అర్ధరాత్రి తర్వాత లారీల్లో లోడింగ్ చేసి, పైలెట్ వాహనాలతో బయటి రాష్ర్టాలకు తరలించడంతో దిట్ట.
ఇతడి దందాకు రెండేళ్ల క్రితం ఓ పోలీసు ఉన్నతాధికారి చెక్ పెట్టడంతో కొంతకాలం రేషన్ దందాకు దూరంగా ఉన్న అతడు మళ్లీ ఏడాదిన్నర కాలం నుంచి తన అక్రమ దందాను కొనసాగిస్తున్నాడు. స్థానిక పోలీస్స్టేషన్ల అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పి, తన చీకటి వ్యాపారాన్ని జోరుగా నడిపిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెలలో ఒకేసారి ఇస్తున్న 3 నెలల బియ్యం పంపిణీలో సదరు నగర శివారుకు చెందిన రేషన్ మాఫియా ఒన్చేసుకోవడానికి పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. అనుచరుల ద్వారా టన్నుల కొద్ది, వందల బస్తాల రేషన్ బియ్యం రహస్య ప్రదేశాల్లో డంప్ చేసి,
అక్కడి నుంచి, అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారుల సపోర్ట్‌తో బయటి రాష్ర్టాలకు తరలించడానికి, వరంగల్ నగర శివారు ప్రాంతాల ఠాణాలతోపాటు, వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామలోని కొన్ని పోలీసు స్టేషన్లకు అనుచరుల ద్వారా నెలవారీగా రూ.30 వేల నుంచి రూ. 50వేల వరకు మామూళ్లు ముట్టజెప్పితున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగర శివారు మాఫియా వ్యక్తి నుంచి వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి నెలకు రూ.2లక్షలు మామూళ్లు తీసుకొని, కింది స్థాయి అధికారులను కట్టడి చేసి, సేఫ్ జోన్ ప్రాంతాల్లో రేషన్ బియ్యం డంపింగ్ చేయడం కోసం, అక్కడి నుంచి సేఫ్‌గా బయటి రాష్ర్టాలకు తరలించడానికి పూర్తి అండదండలు అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.