సుబేదారి, అక్టోబర్13 : ‘హలో సార్.. బాగున్నారా.. మీ బిజినెస్ ఎలా ఉంది?.. ఒకసారి మద్యం బిజినెస్‌లోకి వచ్చి చూడండి.. లాభసాటిగా ఉంటుంది. ఒక్క దరఖాస్తు అయినా వేయండి’ అంటూ ఎక్సైజ్ అధికారులు ఫోన్లు చేస్తున్నారు. కొత్త మద్యం షాప్‌ల టెండర్ అప్లికేషన్లు పెంచడానికి వారు మేనేజర్ల అవతారం ఎత్తారు. దరఖాస్తులకు గడువు దగ్గరపడడంతో వివిధ వ్యాపార సంఘాల జాబితాను ముందు పెట్టుకొని మరీ ఫోన్లు చేసి ప్రభుత్వ ఖజానా పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2025-2027 కొత్త మద్యం వైన్స్ షాపుల టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. గత నెల 26 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా శనివారంతో గడువు ముగుస్తుంది. 23న లక్కీ డ్రా పద్ధతిన జిల్లా కేంద్రంలో కలెక్టర్లు కొత్త మద్యం షాప్‌ల లైసెన్స్ దారులను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో ఇంతకు ముందు టెం డర్ దరఖాస్తు ఫీజు రూ. 2లక్షలు ఉండగా, ఇప్పుడు అదనంగా రూ. లక్ష పెంచడంతో దరఖాస్తు చేయడానికి ముందుకు రావడంలేదని తెలు స్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండేళ్ల క్రితం కంటే ఈసారి ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అదనంగా పది శాతం దరఖాస్తుల సం ఖ్యను పెంచాలని ఎక్సైజ్ జిల్లా, స్టేషన్ అధికారులకు టార్గెట్ విధించి ఒత్తిడి పెంచడంతో వారు పాత మద్యం షాపుల ఓనర్లు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, రైస్‌మిల్లర్స్, బిల్డర్లు, మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు, టింబర్ డిపోలు, క్వారీ యజమానులు, తదితరులకు ఫోన్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లిక్కర్ వ్యాపారులకు కూడా సంప్రదిస్తున్నారు. సోమవారం పశ్చిమ గో దావరి జిల్లాకు చెందిన వారు హనుమకొండలోని ఐదు షాపులకు దరఖాస్తు చేశారు. ఈ సారి కూడా పాత వ్యాపారులు మద్యం బిజినెస్‌లో ఉన్నవారే సిండికేట్ గ్రూపుల వారీగా తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. కాగా, 2023-25లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 కొత్త షాపులకు 15,944 దరఖాస్తులు రాగా, ఇప్పుడు ఒక రోజు గడుఉండగా 4544 రావడం గమనార్హం.