చిన్నగూడూరు, ఆగస్టు 23 : వెట్టిచాకిరి, నిరంకుశత్వం, అణచివేతలతో అంధకారంలో మగ్గుతున్న నాటి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన కవి యోధుడు దాశరథి రంగాచార్యులు. నిజాం రాచరికపు ఆకృత్యాలపై ధిక్కారపు పోరుబావుటా ఎగరేసిన ధీశాలి. నేడు ఆ మహనీయుడి జయంతిని ఆయన స్వగ్రామం చిన్నగూడూరులో ఘనం గా నిర్వహించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో వెంకటాచార్యులు-వెంకటమ్మ దంపతులకు 24 ఆగస్టు 1928లో రంగాచార్యులు జన్మించారు.
బా ల్యం నుంచే ఉద్యమ భావజాలాన్ని కలిగి ఉ న్న రంగాచార్యులు నాటి రాజకీయ, సాంఘిక వ్యవస్థల్లో మార్పు కోసం, పెత్తందార్ల దోపిడీ నుంచి ప్రజలను విముక్తుల్ని చేసేందుకు ఉద్యమబాట పట్టారు. పదునైన రచనలతో ప్రజలను జాగృతం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తనదైన ముద్ర వేసుకున్నారు. రంగాచార్యుల ఉద్యమ పోకడలను గమనించిన భూస్వాములు, నిజాం పాలకులు తమ ఉనికికే ముప్పువాటిల్లే ప్రమాదముందని ముందే గ్రహించి చెరసాలలో బం ధించారు.
అయినా పోరుబాటను వదిలిపెట్ట లేదు. అక్కడి నుంచి తప్పించుకొని అజ్ఞాతం లో ఉంటూ ఉద్యమాన్ని నడిపించారు. ‘చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జీవనయానం, జనపదం’ వంటి ఎన్నో అద్భుత రచనలు చేసి ఎన్నెన్నో అవార్డులు, పురస్కారాలు అందుకొని తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. వేదాలను తెలుగులోకి అనువదించి సాహిత్య చరిత్రలో అగ్రస్థానంలో నిలిచారు.
సాయుధ పోరాటమే ఊపిరిగా, సాహిత్యమే తన ఆస్తిగా భావించి దొరలు, భూస్వాములు ఆగడాలను ఎదురించి, వెట్టిచాకిరి నుంచి ప్రజలను విముక్తులను చేసేందుకు అవిశ్రాంత పోరాటం చేసిన దాశరథి రంగాచార్యుల జయంతిని శనివారం ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. దాశరథి సోదరుల విగ్రహాలు వారి స్వగ్రామం చిన్నగూడూరులోనే మొదట గ్రామస్తులు ఏర్పాటు చేసుకొని ఏటా వర్ధంతి, జయంతిని నిర్వహిస్తున్నారు.
రంగాచార్యులు, కృష్ణమాచార్యుల విగ్రహాలను హైదరాబాద్లోని టాం క్బండ్పై ఏర్పాటు చేయడంతోపాటు మండ ల కేంద్రానికి దాశరథి సోదరుల పేరు పెట్టి సముచిత స్థానం కల్పించాలని ప్రాంత వాసు లు కోరుతున్నారు. రంగాచార్యుల స్వగ్రామంలో జరిగే జయంతి వేడుకలకు ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు, ప్రముఖులు హాజరు కానున్నట్లు స్థానికులు తెలిపారు.