తాడ్వాయి, డిసెంబర్ 25 : ఇటీవల తాడ్వాయి అడవుల్లో సంచరించిన పెద్దపులి మళ్లీ జాడ లేకుండా పోవడం అనుమానాలకు తావిస్తోం ది. పది రోజులుగా వైల్డ్‌లైఫ్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించగా, గత శనివారం లవ్వాల అటవీ ప్రాంతం మీదుగా లింగాల అడవుల్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అప్పటినుంచి కదలికలు కానరాకపోవడంతో పెద్దపులి క్షేమమేనా? వేటగాళ్లతో ప్రమాదం పొంచి ఉందా? అనే ప్రశ్నలు తలెతుత్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇదే లింగాల ప్రాంతంలో ఓ పులి వేటగాళ్ల ఉచ్చుకు బలైన నేపథ్యంలో అటవీ అధికారులు పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర అడవుల నుంచి తాడ్వాయి మండలంలోని అడవులకు వచ్చిన పులి ఇదే లింగాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అడవి జంతువుల కోసం అమర్చిన ఉచ్చుకు బలైంది. నాలుగు నెలల తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులకు పులి ఎముకలు కనిపించడంతో అధికారులకు సమాచారమిచ్చారు. వారు పరిశీలించి అది పులి కళేబరంగా నిర్ధారించి ట్రాప్‌లు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు.
అయితే పది రోజుల క్రితం తాడ్వా యి అడవుల్లోకి ప్రవేశించిన పులి ఇప్పటివరకు ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. దీంతో అధికారులకు సవాల్‌గా మారింది. గతంలో జరిగిన సం ఘటన పునరావృతం అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. పులి సురక్షితంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేలా అటవీ గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు కలుస్తూ పులికి హాని తలపెట్ట వద్దని, ఒకవేళ పులి వల్ల ఏదైనా నష్టం జరిగితే అటవీ శాఖ భరిస్తుందని అవగాహన కల్పిస్తున్నారు. కానీ వేటగాళ్లు అవి పాటిస్తారా అనే అనుమానం లేకపోలేదు. శనివారం లవ్వాల అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించినప్పటికీ రెండు రోజులుగా పులి జాడ కనిపించడం లేదు. అధికారులు బృందాలుగా ఏర్పడి రెండు రోజులుగా నాలుగు వైపులా పులి జాడ కోసం వెతుకుతున్నారు. అయినప్పటికీ పులి జాడ లేకపోవడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. పులి సురక్షితంగా ఉందా? లేదా వేటగాళ్ల ఉచ్చుకు చిక్కిందా? అని తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పులి జాడ కోసం విస్తృతంగా గాలిస్తున్నా ఫలితం ఉండడం లేదు. దీంతో పులి కనిపించకపోవడం జిల్లా వైల్డ్‌లైఫ్ అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నది.