నర్సంపేట రూరల్, మే 20: పిడుగుపాటుకు రైతు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నర్సంపేట మండలంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భోజ్యనాయక్తండాకు చెందిన బానోతు సుమన్(32), జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. శనివారం ఉదయం సుమన్ ఇదే తండా శివారులోని తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ వ్యవసాయ పనులు చేస్తుండగా సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు రావడంతో సమీపంలోని శ్మశానవాటిక వద్దకు వెళ్తుండగా పిడుగు పడింది. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండాకు చెందిన బానోత్ భద్రు, బానోత్ రమాదేవి, అజ్మీర శశిరేఖ తమ వ్యవసాయ పొలాల్లో సాయంత్రం పనులు చేస్తుండగా మరో పిడుగు పడింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. భద్రు, శశిరేఖ స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా, రమాదేవి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. సుమన్ మృతితో భోజ్యనాయక్ తండాలో విషాదం నెలకొంది.
రాములునాయక్తండాలో ఒకరికి గాయాలు
మండలంలోని రాములునాయక్తండాలో శనివారం సాయంత్రం పిడుగు పడింది. దీంతో ఇదే తండా శివారు వ్యవసాయ భూమిలో పనులు చేస్తున్న మహేశ్వరం గ్రామానికి చెందిన లోడం లింగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి లింగయ్యను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
బాధితులకు ఎమ్మెల్యే పెద్ది పరామర్శ
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భోజ్యనాయక్తండాకు చేరుకొని పిడుగుపాటుకు మృతిచెందిన సుమన్‌కు నివాళులు అర్పించి కుటుంబాన్ని ఓదార్చారు. నర్సంపేటలోని ఏరియా చికిత్సపొందుతున్న బానోత్ భద్రు, అజ్మీరా శశిరేఖ, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బానోత్ రమాదేవి, లోడం లింగయ్యను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులను కోరారు.