వరంగల్ చౌరస్తా, మార్చి 31 : పేరుకు పెద్దాస్పత్రులే కానీ వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యసేవల్లో విషయంలో చిన్నచూపు, సౌకర్యాలు కల్పించడంలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిత్యం వేలాది మంది పే షంట్లు వచ్చే ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో అడుగడుగునా సమస్యలే గాక పరీక్షలు చేసే యంత్ర పరికరాలు మరమ్మతుకు నోచుకోక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. కొ త్త యంత్రాలు తేవడం అటుంచి కనీసం పాత వాటి కి రిపేర్లు చేయకుండా ప్లాస్టర్లు చుట్టి, బ్యాండేజ్ కట్టి నెట్టుకురావడం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. ఇలా ఏ విభాగాన్ని చూసినా దెబ్బతిని, మరమ్మతులకు గురైన యంత్ర పరికరాలే కనిపిస్తున్నాయి.
ఎంజీఎంలో వినియోగిస్తున్న చాలా యంత్రాలు పాతవి కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిలో సగం వరకు ప్లాస్టర్లు చుట్టి, బ్యాండేజీలతో కట్లు కట్టి ఉంటున్నాయి. వాటిని చూసిన రోగులు.. అసలు ఇవి పనిచేస్తున్నాయా?అనే అనుమానాలు కలుగక మానదు. ఇటీవల అత్యవసర విభాగంలోని ఎక్స్‌రే యంత్రంలోని ఒక భాగం ఊడిపోయి కిందపడడం త్రుటిలో ప్రమాదం తప్పింది. యంత్రానికి కనీస మరమ్మతులు చేయకుండా గాయాలకు కట్లు కట్టే బ్యాండేజ్‌తో కట్టి పెట్టి ఎక్స్‌రేలు తీయడం వారికే చెల్లింది. దాంతో యంత్ర భాగం సరైన స్థలంలో స్థిరంగా ఉండకపోవడంతో ఎక్స్‌రేలు తీసే సిబ్బంది, పరిశీలించే సమయంలో వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక ఎమర్జెన్సీ, ఓపీ, ఏఎంసీ విభాగాల్లో ఈసీజీ యంత్రాలు పూర్తిగా ప్లాస్టర్లు, బ్యాండేజీలు, ఇరత యంత్రాల వైరింగ్ వ్యవస్థతో తాత్కాల్కికంగా పనిచేసేలా ఏర్పాటు చేసి నెట్టుకొస్తున్నారు.
ఇక సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో మరీ దారుణం. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ విభాగాల్లో చాలా వరకు ఏసీలు పనిచేయడం లేదు. కొంతకాలంగా చివరి లిఫ్ట్ పనిచేయకపోవడంతో దానికి కూడా బ్యాండేజ్ కట్టి ఉంచారు. రేడియాలజీ విభాగంలో పైకప్పునకు ఏర్పాటు చేసిన సీలింగ్ ఊడిపోయి నెలలు గడుస్తున్నా పట్టించుకున్న వారు లేరు. సగం పైకప్పు ఊడిపోయిన విషయాన్ని చూసిన రోగులు మిగితా సీలింగ్ ఎప్పుడు ఊడిపడుతుందోనని అక్కడ నిలబడేందుకు జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని యంత్ర పరికరాలకు శాశ్వత మరమ్మతులు చేయాలని అవసరమున్న చోట కొత్తవి తెప్పించాలని రోగులు, వైద్యులు కోరుతున్నారు.