పోచమ్మమైదాన్, డిసెంబర్ 30 : చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుడు రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతుండగా సీసీఎస్‌తోపాటు మడికొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.12.20 లక్షల విలువైన 183 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 గ్రాముల వెండి, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో శనివారం సీసీఎస్ ఏసీపీ మల్లయ్య వివరాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా గద్వాల్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్ చిన్నతనం నుంచే చోరీలు చేస్తున్నాడు. 2018లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో తాళం వేసి ఇంట్లో చోరీ చేయగా జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి జువైనల్ హోంకు పం పారు. 2022లో జువైనల్ హోం నుంచి వచ్చిన తర్వాత అతడు విజయవాడ, అల్వాల్, కీసర, సిరిసిల్ల, కామారెడ్డి పోలీస్స్టేషన్ల పరిధిలో పలు చోరీలు చేశాడు. పోలీసులు మళ్లీ అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అనిల్‌తో కలిసి ఈ నెల 21న వరంగల్‌కు చేరుకున్నాడు. అనంతరం మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పార్కింగ్ చేసి ఉన్న బైక్‌ను ఎత్తుకెళ్లి, దానిపై ఇద్దరు మడికొండ పోలీస్‌స్టేషన్ పరిధి భట్టుపల్లిలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 18.6 గ్రాముల బంగారం, 6 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో డీసీపీ దాసరి మురళీధర్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, టెక్నాలజీతో ఫిరోజ్‌ను గుర్తించారు. అలాగే, మడికొండలో జరిగిన చోరీపై అతడిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ చూ పిన ఏసీపీ మల్లయ్చ, ఇన్స్పెక్టర్లు శంకర్‌నాయక్, వేణు, దేవేందర్, ఏఏవో సల్మాన్‌పాషా, సీసీఎస్, మడికొండ ఎస్సైలు రాజేందర్, రాజబాబు, ఏఎస్సైలు అశాబీ, కానిస్టేబుళ్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అభినందించారు.