బయ్యారం, జనవరి 19 : బయ్యారం ఉక్కు పరిశ్రమపై నీలినీడలు కమ్ముకున్నాయి. విశాఖపట్టణంలోని ఉక్కు ఫ్యాక్టరీకి భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మరోమారు వివక్ష ప్రదర్శించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రూ.30వేల కోట్ల తో సెయిల్ ఆధ్వర్యంలో తెలంగాణలో భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర అవతరణ అనంతరం కేంద్రం పదేళ్లుగా నాన్చివేత ధోరణి కొనసాగించిందే తప్ప ఉక్కు పరిశ్రమ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సినంత ఖనిజం బయ్యారం ప్రాంతంలో లేదని, అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పలుమార్లు ప్రకటన చేయించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 11,440 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మరోమారు బయ్యారం ఉక్కు పరిశ్రమ చర్చనీయాంశంగా మారింది.
హామీని నెరవేర్చాల్సిందే..
విభజన చట్టంలో చట్టబద్ధంగా లభించిన ఉక్కు పరిశ్రమ ఏర్పా టు హామీని నెరవేర్చాల్సిందే. బ య్యారం అడవుల్లో నాణ్యమైన ఖని జం ఉందని సర్వేలు తేల్చి చెప్పినా కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదు. విశాఖ ఉక్కు కు ప్యాకేజీలు ప్రకటించిన కేంద్రం బయ్యారాన్ని మర్చిపోవడం వివక్షే. నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే చట్టబద్ధ హా మీ లభించింది. కేంద్రంతో కొట్లాడాల్సిన కాంగ్రె స్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయం. ఎన్నికల సమయంలో పరిశ్రమను ప్రచారాస్త్రంగా వాడుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడెందుకు మాట్లాడడం లేదో ప్రజలకు చెప్పాలి.
– గౌని ఐలయ్య, ఉక్కు సాధన కమిటీ కన్వీనర్, బయ్యారం
Warangal3
కావాల్సినంత ఖనిజం..
వాస్తవాలు పరిశీలిస్తే ఉమ్మడి ఖ మ్మం, వరంగల్ జిల్లాల్లో 1,41,6 91 ఎకరాల్లో ఇనుప ఖనిజం విస్తరించి ఉంది. 2014లో బయ్యారం అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సెయిల్ ప్రతినిధుల బృందం ఇనుప ఖనిజం లభ్యత, నాణ్యతపై నివేదిక ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ విషయమై 2015లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసింది. ఉక్కు తయారీలో ఉపయోగించే 45 శాతం కంటే అధిక నాణ్యత కలిగిన 11 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం నిల్వ ఉంద ని తేలింది. స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత ఖనిజం ఉందని నాడే స్పష్టమైంది. అయినా కేంద్ర ఉక్కు శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఓ లేఖ పంపినట్లు సమాచారం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. మరో అడుగు ముందుకేసి మహబూబ్‌నగర్ సరిహద్దున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి ముడి ఇనుము తెచ్చుకునే వీలున్నందున అక్కడ కూడా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయొచ్చని, దీనిపై అవసరమైతే సెయిల్‌తో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని కేంద్రం పేర్కొన్నట్లు తెలిసింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉక్కు పరిశ్రమ సాధిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు అనంతరం మళ్లీ ఆ ఊసే ఎత్తకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.