హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 26 : కేయూ తెలుగు విభాగం ఆచార్యుల పరిశోధన కృషి సాహితీ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని మాజీ వీసీ గోపాల్‌రెడ్డి అన్నారు. కేయూ తెలుగు విభాగం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో సోమవారం సెనేట్ హాల్లో ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుల సాహిత్య సేవ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. తెలుగు విభాగం పూర్వ ఆచార్యులు సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో రచనలు చేశారన్నారు.
వారి సాహిత్య కృషి భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమన్నారు. అనంతరం సదస్సు ప్రారంభకులు ఆచార్య సుప్రసన్నాచార్య, ఆచార్య కాత్యాయని విద్మహే, ఆచార్య బన్న అయిలయ్య మాట్లాడారు. మంథని శంకర్, చిర్ర రాజు, చింతం ప్రవీణ్, ఆగపాటి రాజ్‌కుమార్, అన్నపూర్ణ, కర్రె సదాశివ్, తదితరులు పాల్గొన్నారు.