పోచమ్మమైదాన్, నవంబర్ 10 : ప్రజా గొం తుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం ఉమ్మడి జిల్లాలోని సాహితీవేత్తలను దుఃఖసంద్రంలో ముంచింది. కవులు, కళాకారులు, రచయితలు ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన రచించిన రాష్ట్ర గీతం ‘జయ జ యహే తెలంగాణ జననీ జయకేతనం’, ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’, ‘జన జాతరలో మన గీతం’, తదితర పాటలు ఎప్పటికీ జనం గుండెల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఈ సందర్భంగా సహృదయ సంస్థ, కాళోజీ ఫౌండేషన్, మిత్ర మండలి సభ్యులతో పాటు పలువురు సాహితీవేత్తలు సంతాపం ప్రకటించారు.
ఓరుగల్లులో కాళోజీ పురస్కారం.. డాక్టరేట్ ప్రదానం చేసిన కేయూ

వరంగల్లోని కాళోజీ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా అందెశ్రీకి 2016 సంవత్సరంలో కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఆ యన తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని కొనియాడారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న కాళోజీ పురస్కారాల కమిటీలో భాగంగా ఈ ఏడాదికి అందెశ్రీ చైర్మన్గా ఉన్నా రు. ఇదే క్రమంలో ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది.
పురస్కారాలు, అవార్డులు

అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ప్రస్తుతం రేబర్తి గ్రామం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత సిద్దిపేట జిల్లాలో కలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనాథ అయిన అందెశ్రీ గొర్రెలు, పశువుల కాపరిగా, తాపీమేస్త్రీగా పనిచేశారు. అంతగా చదువుకోకపోయినా ఆయన పాడిన పాటలు రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందాయి. విప్లవాత్మక సినిమాల్లో అందెశ్రీ రాసిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. సినీ రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. అలాగే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించడా నికి ‘జయ జయహే తెలంగాణ’ గీతం రాసి ఉత్తేజపరిచారు.
అక్షరానికి దూరంగా ఉన్నా.. అందరికీ స్ఫూర్తిదాయకం..
అందెశ్రీ చదువుకు, అక్షరానికి దూరంగా ఉన్నా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మట్టి వాసనను ఆయన మనసు కవిత్వాన్ని అల్లింది. ప్రకృతి అనుభవమే గురువుగా, బడిగా మారింది. తెలంగాణ నేల ఆత్మను పలికించే సహజసిద్ధమైన ఆశు కవిత్వం. ఆయన రచనలు, పాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.