నర్సంపేట, జూలై 11 : హత్యకు గురైన దంపతుల మృతదేహాలతో బంధువులు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట పోలీసుస్టేషన్ ఎదుట గురువారం రాస్తారోకో చేశారు. నిందితుడు మేకల నాగరాజును ఉరితీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయం జరిగేవరకూ కదిలేది లేదని రోడ్డుపై బైఠాయిచగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మద్దతు పలికారు. గురువారం ఆస్పత్రిలో మృతదేహాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంత ఘోరమైన ఘటన జరిగినా ప్రభుత్వం తరఫున ఎవరూ రాకపోవడాన్ని తప్పుపట్టారు.
స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలంలో దంపతులు హత్యకు గురైతే మొఖం కూడా చూపలేదని, ఆయన స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కొత్త డీజీపీ చొరవ చూపి నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇద్దరు పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పెద్ది డిమాండ్ చేశారు. అలాగే పట్టణంలోని అమరవీరుల జంక్షన్లో లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్, ఓడీసీఎంఎస్ నాయకులు గుగులోత్ రామస్వామినాయక్, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, జడ్పీటీసీ సభ్యుడు బానోత్ పత్తినాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు వాసునాయక్ పాల్గొన్నారు.