రాయపర్తి, సెప్టెంబర్ 29 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన దళిత కాలనీవాసులు మంత్రి ఎర్రబెల్లిని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారితో కాసేపు ముచ్చటించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని సబ్బండ కులాలు, సకల జాతుల సమగ్రాభివృద్ధికి సమాన స్థాయిలో ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని వెంకటేశ్వరపల్లిలో నెలకొల్పేందుకు అవసరమైన రూ.60వేల నగదును అందజేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. దళితులను ధనవంతులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని మండలంలోని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకుడు
మండలంలోని పెర్కవేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి గారె సాయిలు శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మంత్రి ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. కాగా, బీఆర్ఎస్ మండల నాయకుడు చిన్నాల రాజబాబు, గ్రామ అధ్యక్షుడు బొమ్మెర వీరస్వామి, బండి రాజబాబు, కుల్లా వెంకన్న, భాషబోయిన సుధాకర్, మంగిశెట్టి రాజు, గారె కిరణ్, బండి కుమార్, ఆకుల సమ్మయ్య, మాకినేని పెద్ద కృష్ణారావు తదితరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును గారె సాయిలు మర్యాదపూర్వకంగా కలుసుకుని పార్టీలో చేరారు.