హనుమకొండ చౌరస్తా, జనవరి 21: ప్రజారోగ్య సంరక్షణలో ఫార్మసీ రంగం కీలకమని కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ నేతృత్వంలో మంగళవారం ‘డ్రగ్ డిసవరీ ఇన్నోవేషన్ డెవలప్మెంట్’ అనే అంశంపై ఒకరోజు అంతర్జాతీయ వర్క్‌షాప్ సెనేట్ హాల్లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ మానవ మనుగడలో ఫార్మాసిస్టుల పాత్ర గొప్పదని, రోజురోజుకూ విజృంభిస్తున్న అనేక రోగాలకు నూతన ఔషధాలు కనుక్కొని ప్రాణాలు కాపాడుతున్నారని కొనియాడా రు.
ప్రపంచవ్యాప్తంగా కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రూ.12కోట్లతో పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించా రు. ఫార్మసీలో పరిశోధనలను ప్రో త్సహిస్తానని వెల్లడించారు. వర్క్‌షాప్‌లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ మల్లారెడ్డి, ఫార్మసీ విభాగం ప్రొఫెసర్లు, రిటైర్డు ప్రొఫెసర్లు సారంగపాణి, కిషన్, అచ్చయ్య పాల్గొన్నారు.