బయ్యారం, ఫిబ్రవరి 10 : విద్యార్థులకందించే మెనూ విషయంలో తీరు మారకుంటే చర్యలు తప్పవని ఏకలవ్య పాఠశాల సిబ్బందిని ఇన్చార్జి ఆర్సీవో ఆగస్టీన్ హెచ్చరించారు. మండలంలోని నామాలపాడు ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని శుక్రవారం ‘అమలు కాని మెనూ.. సరిపోని టిఫిన్’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశంతో శనివారం ఏకలవ్య పాఠశాలను ఆర్సీవో సందర్శించారు. కిచెన్, డైనింగ్హాల్ను పరిశీలించారు. మెనూను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటలను రుచి చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజుల్లో మళ్లీ వస్తానని, తీరు మారకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మెనూ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులనుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకోవాలని ప్రిన్సిపాల్ రవిబాబును ఆదేశించారు. అదేవిధంగా ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి కూడా ఏకలవ్య పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి కిచిడి తిని, నాణ్యత లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.