వరంగల్ చౌరస్తా, జూలై 13 : ఎంజీఎం హాస్పిటల్ మార్చురీలో మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్లు పనిచేయక శవాలు కుళ్లిపోతున్నాయి. మార్చురీ ఆవరణలో కనీసం నిల్చునేందుకూ వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి. శవానికి పంచనామా నిర్వహించాల్సిన పోలీసులు, బంధువులు కనీసం ఆ ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. ప్రమాదాలు, అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వ్యక్తులు, ఆత్మహత్యలు చేసుకున్న వారికి తప్పనిసరి శవపరీక్షలు చేయాల్సి ఉంటుంది.
మార్చురీలో ఉన్న పది ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో గుర్తుతెలియని మృతులకు పోస్టుమార్టం నిర్వహించే సమయానికి శవాలు పూర్తిగా కుళ్లిపోయేస్థితికి చేరుకుంటున్నాయని ఫోరెన్సిక్ వైద్యులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి 72గంటల తర్వాత పంచనామా చేసి, ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం చేసిన తర్వాత వాటిని ఖననం చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్రీజర్లు పనిచేయక ఆ శవాలు మూడు రోజుల పాటు గది ఉష్ణోగ్రతలో ఉండడం వల్ల కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. మార్చురీలో పది ఫ్రీజర్లు అందుబాటులో ఉన్నా పనిచేసే స్థితిలో లేకపోవడంతో కేవలం ఫ్యాన్లు, ఎగ్జిస్టింగ్ ఫ్యాన్లతో గది ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నా అది ఓ ప్రయత్నంగానే మిగిలిపోతున్నది.
మరమ్మతులతోనే సరి..
ఎంజీఎంలోని ఫ్రీజర్లు హర్యానా సంస్థ తయారు చేసి టీజీ ఎంఎస్ఐడీసీ ద్వారా అం దజేసింది. వీటి మరమ్మతులకు సంబంధించి ఒప్పందం ఉన్నప్పటికీ సదరు సంస్థ నిర్వాహకులు స్పందించకపోవడంతో తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. అయినా తర చూ రిపేర్లకు రావడంతో అవి వినియోగించే స్థితిలో లేవు. ఇప్పటికైనా శాశ్వతంగా ప్రత్యేక ఐస్ చాంబర్ నిర్మించి మృతదేహాలు పాడవకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
మృతుల బంధువులకు తప్పని ఇబ్బందులు
ఎంజీఎంలో శవ పరీక్షలు పూర్తి చేసుకోవడమంటే మృతుడి బంధుమిత్రులు జంకుతున్నారు. అనారోగ్యంతో ఓపీ సేవలకు వచ్చే రోగి గరిష్ఠంగా మధ్యాహ్నానికి తన పరీక్షలు పూర్తి చేసుకొని వెళ్తాడు. కానీ మార్చురీలో పోస్టుమార్టం ఎంత సమ యం పడుతుందో చెప్పడం కష్టం. దూర ప్రాంతాల నుంచి పోలీసులు సమయానికి రాకపోవడం, పంచనామా ఆలస్యం కావ డం వల్ల గంటల సమయం మార్చురీ ఆవరణలో వేచి ఉండాల్సి వస్తుంది. ఫోరెన్సిక్ వైద్యులు శవపరీక్షలు జరిపి పోస్టుమార్టం పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుంది. మృతదేహాన్ని వదిలి వెళ్లడానికి మ నసురాని బంధుమిత్రులు మార్చురీ ఆవరణలో వేచి ఉండేందుకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మార్చురీ ఆవరణలో కనీస తాగునీటి వసతి లేదు. మూత్రశాలలు ఉన్నా కంపుకొట్టడం, నీటి సౌకర్యం లేకపోవడంతో వినియోగించే స్థితిలో లేవు.