కాకతీయుల పౌరుషానికి, చైతన్యానికి ప్రతీకలుగా నిలిచిన కోట గోడలు కూలిపోతున్నాయి. శత్రు సైన్యాలు కోటలోకి నేరుగా రాకుండా ఉండేందుకు, వారిని అయోమయానికి గురిచేసేలా నిర్మించిన సింహద్వారాలు కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు కూలి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పర్యాటకులు, స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కట్టడాలు కూలి కిందపడుతున్నా కేంద్ర పురావస్తు శాఖ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– ఖిలావరంగల్, మే 11
చారిత్రక పర్యాటక ఖిల్లా, ప్రకృతి అందాలకు నెల వు.. సుందర ప్రదేశాలు, ఆలయాలు, శిల్పసంపదకు కొలువు.. కోటలు.. ప్రాకారాలు.. అగడ్తలలోని నీటి అ లలు, కీర్తి తోరణాలు, బావులు, కొలనులు ఒకటా రెం డా అనేక అద్భుత శిల్ప కళా ఖండాలు. ఒకప్పుడు దేదీ ప్య మానంగా వెలుగొందిన కాకతీయల కోట కాలగర్భంలో కలిసిపోతున్న తీరు పర్యాటకులను ఆందోళన కు గురిచేస్తున్నది. కోటను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు, పనుల నిమిత్తం రాకపోకలు సాగించే స్థానికులకు కూలిపోయే గోడలతో ప్రమాదం పొంచి ఉంది.
కోటల నిర్మాణం
కాకతీయ చక్రవర్తులు శత్రుదుర్భేద్యమైన కోటలు నిర్మించారు. ఇందులో పుట్ట కోట, మట్టి కోట, రాతికోట. 12.5 కిలోమీటర్ల వ్యాసం కలిగిన పుట్టకోట ఆనవాళ్లు గీసుగొండ మండలం వంచనగిరి, వెంకటాపురం, మొగిలిచర్ల, బొల్లికుంట, కొండపర్తి, పైడిపల్లి, ఆటోనగర్ రోడ్డు తదితర వరకు స్పష్టంగా కనిపిస్తాయి. అదే తరహాలో మట్టికోట 2.4 కిలోమీటర్ల వ్యాసం, 7.2 కిలోమీటర్లు గుండ్రంగా ఉంది. ఈ కోటకు తూర్పు, పశ్చిమ ద్వారాలు కేవలం గజ, తుర గ, పదాతి దళాలు నడిచేలా ఉండగా పాదచారుల కోసం నిర్మించిన మరో ఆరు ద్వారాలున్నాయి.
అలాగే రాతి కోట 4 కిలోమీటర్ల చుట్టూ 1.2 కిలో మీటర్ల వ్యాసం కలిగిన కోట పై 42 బురుజులు కలిగి నాలుగు వైపులా నాలుగు సింహద్వారాలతో శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. ప్రస్తుతం రాతి కోట తూర్పు, ఉత్తర, దక్షిణ సింహ ద్వారాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. ఈ నెల 10 సాయంత్రం దక్షిణ ద్వారం దర్వాజ పైకప్పు భారీ బండరాయి కూలిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల చారిత్రక ప్రాశస్త్యం నేలకొరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పురావస్తుశాఖకు చెందిన అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది చూసీచూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆయా శాఖల పట్టింపులేనితనం వల్ల రాతి కోట ఇది వరకే ఉత్తర ద్వారం నుంచి దక్షిణ ద్వారం వరకు పలు చోట్ల పూర్తిగా నేలమట్టమైంది. పునర్నిర్మాణం పేరుతో అధికారుల పర్యవేక్షణ తప్ప పనులపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి. గతేడాది కురిసిన వర్షాలకు తూర్పుకోట ద్వారం వద్ద కోట రాళ్లు కూలి నేలమీద పడ్డాయి. ఈ ఏడాది దక్షిణ ద్వారం వద్ద దర్వాజ పైకప్పు కూలిపోయింది. రాతికోట ప్రతి ద్వారం వద్ద శత్రువులను అయోమయానికి గురి చేసేలా మూడు దర్వా జలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆ దర్వాజలు సైతం కూలుతుండడంతో పర్యాటకు లు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్వారాలు పూర్తిగా పడిపోకముందే కేంద్ర పురావస్తు శాఖ అధికారులు స్పందించి పునర్నిర్మాణ పనులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.