అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులు పండించిన ధాన్యానికి రూ. 500 బోసన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తీరా అధికారంలోకి రాగానే మాట మార్చి సన్న వడ్లకే చెల్లిస్తామంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రోజులు గడుస్తున్నా వారి ఖాతాల్లో నగదు వేయకుండా తాత్సారం చేస్తున్నది. బోసన్ అంటేనే బోగస్ అనేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనికి తోడు మానుకోట జిల్లాలోని పలు ఏజెన్సీ మండలాల్లో ఆర్వోలు ఇవ్వకపోవడంతో ధాన్యం విక్రయించినప్పటికీ నగదు జమకావడం లేదు. రైతులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, డబ్బులు ఎప్పుడొస్తాయని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పడం లేదు. పట్టింపులేకుండా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా కలెక్టర్ ఆదేశాలనూ బేఖాతర్ చేస్తున్నారు.
– మహబూబాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ)
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ క్వింటా వడ్లకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం సన్నాలకే ఇస్తామంటూ మాట మార్చింది. ఇప్పటికే ధాన్యం అమ్మినప్పటికీ తమ ఖాతాల్లో నగదు జమకావడం లేదని రైతులు ఇబ్బందులు పడుతుండగా, బోసన్ డబ్బులు కూడా రాక మరింత ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత 48 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమయ్యేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలో డబ్బులు పడుతున్నాయి. ఇక బోనస్ ముచ్చట అడిగితే సమాధానం చెప్పే అధికారులు లేకుండా పోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నాలకు సంబంధించిన బోనస్ డబ్బులు పెద్ద మొత్తంలో రైతులకు పడాల్సి ఉంది. మొత్తం 33,958 మంది రైతులకు రూ. 85.24 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
Desnutricion
ధాన్యం డబ్బులు ఏవి?
మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 32,723 మంది రైతుల నుంచి రూ. 357.88 కోట్ల విలువ చేసే 1,54,343 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 28,057 మంది రైతులకు సంబంధించిన 1,27,744 మెట్రిక్ టన్నులకు సంబంధించి రూ.296.17 కోట్లు ఖాతాల్లో జమ చేసింది. ఇంకా 4,666 రైతులకు చెందిన 26,599 మెట్రిక్ టన్ను ధాన్యానికి ఆర్వోలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. దీంతో రూ.61.71 కోట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఏజెన్సీ మండలాల రైతులు ఆగమాగం..
మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, కొత్తగూడ, గంగారం ఏజెన్సీ మండలాల రైతులకు సమస్య మరీ ఎకువగా ఉంది. గార్ల మండలంలో గార్ల -1, గార్ల-2 కొనుగోలు కేంద్రాల్లో సుమారు 200 మంది రైతులు గత ఏడాది డిసెంబరు 22న వడ్లు విక్రయించారు. వీటికి సంబంధించిన ఆర్వోలు పౌరసరఫరాల శాఖ నుంచి రాకపోవడంతో ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు న యా పైసా పడలేదు. గతంలో బయ్యారం, గార్ల మండలాల్లో కలెక్టర్ స్వయం గా పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులు పౌరసరఫరాల శాఖ అధికారుల చుట్టూ రోజూ తిరుగుతున్నా సరైన సమాధానం చెప్పడం లేదు. గార్ల మండల కేంద్రంలోని పద్మావతి రైస్ మిల్లుకు మొదటిగా 30 వేల బస్తాలకు ఆర్వోలు విడుదల చేసిన అధికారులు డిసెంబర్ 22 నుంచి ఇప్పటి వర కు సుమారు మరో 30 వేల బస్తాలు దిగుమతి చేసుకున్నారు. ఇప్పటి వర కు ఆర్వోలు ఇవ్వకపోవడంతో డబ్బులు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసి నా కమిషనర్ వద్ద నుంచి ఆర్వోలు రావాలని చెప్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
నేను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన. గత డిసెంబర్ 22న కాంటా అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్వోలు రాలేదని వడ్ల డబ్బులు ఖాతాలో వేయడం లేదు. పొలాలు కోసిన మిషన్ డబ్బులు ఇవ్వడానికి కూడా రైతుల వద్ద డబ్బులు లేవు. అధికారులు పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం రైతులకు శాపంగా మారింది.
– ఆగాల రామారావు, రైతు, గార్ల
బోనస్ డబ్బులు రాలేదు
నాకు 10 ఎకరాల భూమి ఉంది. ధాన్యం డబ్బులు పడ్డాయి. కానీ బోనస్ డబ్బులు రాలేదు. గత నెల 15 నుంచి ఇప్పటివరకు రూపాయి కూడా పడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
– కత్తి సత్యం, రైతు, గార్ల
Kkk