జయశంకర్ భూపాలపల్లి. ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ఆయుష్ వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఉమ్మడి జిల్లాలో కేవలం వరంగల్‌లో మాత్రమే అనంతలక్ష్మి ఆయుర్వేద దవాఖాన 150 పడకలు(వైద్య కళాశాలకు అనుబంధం) అందుబాటులో ఉండగా ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఆయుష్ ఇంటిగ్రేటెడ్ దవాఖానలు లేవు. ఈ క్రమంలో ఆయుష్ వైద్య సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ సర్కారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాలకు ఒక్కో భవానానికి రూ.10 కోట్లతో మూడు 50 పడకల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ దవాఖాన భవన నిర్మాణ పనులను ప్రారంభించి పనులు పూర్తి చేయించింది.
కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డిసెంబర్ 14న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ దవాఖాన భవనాన్ని ప్రారంభించి చేతులు దులుపుకొన్నారు. రెండు నెలలైనా ఫర్నిచర్, ఇతర సౌకర్యాలేవీ కల్పించలేదు. మెడిసిన్ కూడా రాలేదు. ఇదిలా ఉండగా కలెక్టర్ రాహుల్‌శర్మ ప్రారంభోత్సవానికి ముందు భవనాన్ని తాత్కాలికంగా నర్సింగ్ కళాశాలకు అప్పగించగా కళాశాల యాజమాన్యం ఆ భవనానికి నర్సింగ్ కళాశాల అని బోర్డు పెట్టి ఫర్నిచర్, ఇతర సామగ్రిని ఏర్పాటు చేసుకుని తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనిపై ఆయుష్ డైరెక్టర్ అభ్యంతరం తెలిపారు. దీంతో అందులో నర్సింగ్ కళాశాల తరగతుల నిర్వహణను నిలిపివేసి బోర్డును మార్చేశారు.
వైద్యసేవల కోసం ఎదురుచూపులు
భూపాలపల్లిలోని ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నర్సింగ్ కళాశాల నుంచి భవనాన్ని ఆయుష్కు అప్పగిస్తే సేవలను ప్రారంభించేందుకు ఆయుష్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయుష్ హాస్సిటల్‌కు ఎన్ఆర్హెచ్ఎం నుంచి డిప్యూటేషన్‌పై వైద్యులను అలాట్ చేశారు. ఫర్నిచర్, మెడిసిన్, స్టాఫ్ రావాల్సి ఉంది. ఆయుష్ భవనంలోని మూడు ఫ్లోర్లలో నర్సింగ్ కళాశాల ఫర్నిచర్, ఇతర సామగ్రి ఉండడంతో వాటిని షిఫ్ట్ చేస్తే త్వరలో ఓపీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయమై ఈ నెల 6న జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ఆయుష్ హాస్పిటల్లో ఓపీ త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఓపీ మొదలైతే ప్రజలకు ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ సంప్రదాయక వైద్యం కోసం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎంతో ఆశగా వేచిచూస్తున్నారు.
జిల్లాలో 8 డిస్పెన్షరీలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8 ఆ యుష్ డిస్పెన్షరీలు ఉన్నాయి. మూడు ఆయుర్వేదిక్, రెండు హోమియోపతి, మూడు యునాని డిస్పెన్సరీలు ఉన్నాయి. దామెరకుం ట, ధర్మారావుపేట, కొడవటంచలో ఆ యుర్వేదిక్ డిస్పెన్షరీలు ఉండగా దామెరకుంట, కొడవటంచలో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్లు సేవలు అందిస్తున్నారు. అలాగే ధర్మారావుపేటలో ఎన్ఆర్హెచ్ఎం మెడికల్ ఆఫీసర్ వారానికి మూడు రోజులు(గురు, శుక్ర, శని) వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే చల్లగరిగె, మహాముత్తారంలో హోమియోపతి డిస్పెన్షరీలు ఉండగా చల్లగరిగెలో డాక్టర్ ఉండగా మహాముత్తారంలో లేరు. మహదేవపూర్, వల్లెంకుంట, మొగుళ్లపల్లిలో యునాని డిస్పెన్సరీలు ఉండగా మహదేవపూర్‌లో డిప్యూటేషన్‌పై డాక్టర్ సేవలు అందిస్తున్నారు. వల్లెంకుంటలో బిల్డింగ్ లేదు. మొగుళ్లపల్లిలో డాక్టర్, స్టాఫ్ లేక డిస్పెన్సరీ మూసివేశారు.
త్వరలో ఓపీ సేవలు ప్రారంభిస్తాం
జయశంకర్ భూపాలపల్లిలో కొత్తగా నిర్మించిన ఆయుష్ హాస్పిటల్లో త్వరలోనే ఓపీ సేవలు ప్రారంభిస్తాం. 50 బెడ్లతో కంప్లీట్‌గా ఆయుర్వేదిక్, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి వైద్యం అందిస్తాం. కానీ భవనం ఇంకా మాకు అప్పగించలేదు. మూడు ఫ్లోర్లలో నర్సింగ్ కళాశాలకు చెందిన ఫర్నిచర్, ఇతర సామగ్రి ఉంది. స్టాఫ్ కావాలని డైరెక్టర్‌ను కోరాం. ఎన్ఆర్హెచ్ఎం నుంచి డిప్యూటేషన్‌పై వైద్యులను కేటాయించారు. మెడిసిన్, స్టాఫ్, ఫర్నిచర్ రావాల్సి ఉంది. నర్సింగ్ కళాశాల కోసం రెండు నెలలు పైఫ్లోర్ కావాలని అడిగారు. కలెక్టర్, మా డైరెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. జిల్లాలోని 8 డిస్పెన్సరీల్లో కూడా పూర్తిస్థాయిలో డాక్టర్లను, స్టాఫ్‌ను నియమించి ఉపయోగంలోకి తీసుకొస్తాం.
– డాక్టర్ చంద్ర, ఆయుష్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్