వరంగల్, సెప్టెంబర్ 3 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) విస్తరణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్న ఆలోచనలతో ప్రభుత్వం కుడా పరిధి విస్తరణకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కుడా పరిధి 1805 చదరపు కిలోమీటర్లు ఉండగా, దానిని 2800 చదరపు కిలోమీటర్లకు పెంచాలని అధికారులు భావిసున్నారు. ప్రస్తుతం కుడా పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 19 మండలాలు,181 గ్రామాలుండగా, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట జనగామ పట్టణాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్‌ను కూడా తీసురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
జీపీలకు సర్క్యులర్లు
కుడాలో విలీనానికి అనుకూలంగా తీర్మాణాలు చేసి పంపించాలని గ్రామ పంచాయతీలకు కలెక్టర్ కార్యాలయం నుంచి సర్క్యులర్లు జారీ అయ్యాయి. హుస్నాబాద్, వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, జనగామ ఎమ్మెల్యేలకు కూడా విస్తరణపై సమాచారం ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి మండల కేంద్రంతో పాటు మాల్లారం, కొత్తకొండ, ముస్తఫాపూర్, గట్ల నర్సింగాపూర్, వంగర, రత్నగిరి, కన్నారం, మాణిక్యాపూర్, పరకాల పట్టణంతో పాటు రాజిపేట, కామారెడ్డిపల్లి, మాదా రం, వెల్లంపల్లి, పోచారం, మల్లక్కపేట గ్రా మాలకు సర్క్యులర్లు జారీ అయ్యాయి. అలాగే ఆత్మకూరు మండలంలోని కామారం, పెంచికలపేట్, నీరుకుళ్ల, బ్రాహ్మణపల్లి, దామెర మండలంలోని సర్వాపూర్, కంఠాత్మకూర్, కౌకొండ, నడికూడ మం డలం కేంద్రంతో పాటు ధర్మారం, రాయపర్తి, ముస్త్యాలపల్లి, శాయంపేట మండల కేంద్రంతో పాటు పత్తిపాక, సింగారం (కొత్తగట్టు), హుస్సేన్‌పల్లి, మైలారం, పెద్దకోడెపాక, తహరాపూర్, గట్లకానిపర్తి, ఐనవోలు మండలంలోని నందనం, కక్కిరాలపల్లి గ్రామాలకు కూడా జారీ చేశారు.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్ణణంతో పాటు చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల్లోని గ్రామాలు సైతం కుడా పరిధిలోకి రానున్నాయి. స్టేషన్ ఘన్‌ఫూర్ నియోజకవర్గం పరిధిలోని జఫర్గడ్, లింగాలఘనపూర్ మండాలలను కుడా పరిధిలోకి తీసుకురానున్నారు. జనగామ పట్ణణంతో పాటు జనగామ రూరల్ ప్రాంతాలను కలిపేందుకు ఇప్పటికే సర్క్యులర్లు జారీ ఆయ్యాయి. కాగా, కుడా పరిధిని విస్తరిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరగనుంది. అయితే కుడా పరిధిలోకి వెళ్తే తమ ఆదాయం తగ్గిపోతుందని విలీనాన్ని జీపీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీల కాల పరిమితి ముగియడంతో విలీనం చేయడం ప్రభుత్వానికి సులువుగా మారింది.