నెక్కొండ, జూలై 15 : వారం క్రితం గురుకులం నుంచి ఇంటికొచ్చిన బాలుడు అంతలోనే అనూ హ్య రీతిలో మృత్యువాతపడడం తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. జ్వరంతో బాధపడుతూ అనారోగ్యంతో చనిపోయాడని ఒకలా, ఆర్ఎంపీ వేసిన యాంటీరేబిస్ వ్యాక్సిన్ వల్లే వైద్యం వికటించి మృత్యువాతపడ్డాడని ప్రచారం జరుగడం అనుమానాలకు తావిస్తోంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండలో బాలుడు మణిప్రదీప్(10) మృతి ఘటనపై తెలంగాణ వైద్య మండలి(టీజీఎంసీ) స్పందించి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం ఆధారంగా సుమోటోగా స్వీకరించి వరంగల్ జిల్లా యాంటీ క్వాకరి బృందాన్ని విచారణ జరుపాలని ఆదేశించింది. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తిలోని మహాత్మజ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న మణిప్రదీప్ వారం క్రితం ముదిగొండలోని తన ఇం టికి వచ్చాడు. నాలుగైదు రోజులుగా జ్వరం వస్తోందని, ఉదయం శరీరంపై దద్దులు వచ్చాయని, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకువెళ్లామని తల్లిదండ్రులు చెప్పారు. అయితే చికిత్స అందించే లోపే కన్నుమూశాడంటూ తల్లిదండ్రులు కోటేశ్వర్-సరిత బోరున విలపించారు. కళ్లెదుట తిరిగిన బాలుడు అకస్మాత్తుగా మృతిచెందడంతో గ్రా మంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలుడు మృతిచెందినట్లు అటు సామాజిక మాధ్యమాల్లో, గ్రామంలో చర్చ జరుగుతోంది. వా రం క్రితం మణిప్రదీప్ను కుక్క కరవడంతో ఎంజీఎంలో వ్యాక్సిన్ ఇప్పించారని, సోమవారం ఇచ్చే డోసును స్థానిక ఆర్ఎంపీతో వేయించాల్సి ఉంది. అయితే వాక్సిన్ ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడు అస్వస్థతకు గురయ్యాడని, మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు ఎంజీఎం వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం.
మణిప్రదీప్ మృతి ఘటనపై తెలంగాణ వైద్య మండలి స్పందించింది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు సుమోటోగా ఈ కేసును స్వీకరించి వరంగల్ జిల్లా యాంటీ క్వాకరి బృందాన్ని విచారణ జరపాలని ఆదేశిస్తూ మండలి చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ దండెం లాలయ్య కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన వైద్యబృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనున్నది. ఆర్ఎంపీ అశోక్ చికిత్స అందించిన క్లినిక్ స్థలాన్ని తని ఖీ చేసి నివేదికను అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. టీజీఎంసీ సభ్యులు డాక్టర్ ఎంశేషుమాదవ్, టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ వి.నరేశ్‌కుమార్, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు అన్వర్‌మియా, హెచ్ఆర్డీఏ అధ్యక్షులు పులిపాక వెంకటస్వామి, తానా రాష్ట్ర మాజీ అధ్యక్షులు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం విచారణ జరుపనున్నది. వారు అందించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని రిజిస్ట్రార్ డాక్టర్ దండెం లాలయ్యకుమార్ జారీ చేసిన ఉత్వర్వుల్లో తెలిపారు.