జైశ్రీరాం.. జైశ్రీరాం నామస్మరణతో ఊరూవాడ మార్మోగింది. సోమవారం రామజన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరుగగా ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనులారా వీక్షించి భక్తజనం తరించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు ఆలయాలు, పట్టణాల్లోని కూడళ్లలో అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ వేడుకను తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అనంతరం భక్తుల కోసం మహాన్నదానం నిర్వహించారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌తో పాటు విశ్వహిందూ పరిషత్, పలు మిత్ర మండళ్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలు, చిత్రపటాలతో గ్రామాలు, పట్టణాల్లో కన్నులపండువగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు పట్టగా చిన్నాపెద్దా కోలాటాలు వేస్తూ రామనామ సంకీర్తనలు చేసుకుంటూ ముందుకుసాగారు. ఇలా ఊరూవాడన ఎక్కడచూసినా పండుగ వాతావరణం కనిపించగా ప్రజలంతా భక్తిపారవశ్యంలో మునిగితేలారు.