వరంగల్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంపూర్ణమైంది. బీసీల న్యాయమైన డిమాండ్‌కు సమాజంలోని సబ్బండవర్గాలు అండగా నిలిచాయి. ఉమ్మడి జిల్లాలో రెండు మూడు చోట్ల అదీ రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడాలని చూసినా బీసీ సమాజం బలంగా తిప్పికొట్టింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా సంపూర్ణమైంది.
వరంగల్, హన్మకొండ, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ ఇలా ఆరు జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల వారీగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు బంద్ పాటించాయి. బీసీ కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఎమ్మార్పీఎస్, ఎల్‌హెచ్‌పీఎస్ తదితర సామాజిక సంస్థలు, వివిధ రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు, ఆయా పార్టీల విద్యార్థి సంఘాలు బీసీ సమాజానికి అండగా నిలిచి ఓరుగల్లు ఉద్యమస్ఫూర్తిని చాటాయి.
ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచి బీసీలకు సంఘీభావం ప్రకటించాయి. అయితే, దీపావళి పండుగపూట సొంత ఊళ్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించినా బీసీ వర్గాల ఆవేదనను అర్ధం చేసుకొని సహకరించారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ఒకరోజు ముందే వ్యవసాయ మార్కెట్ యార్డులకు సెలవు ప్రకటించడంతో రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులకు తరలించకుండా సహకరించారు. దీపావళి పండుగతో ముడిపడి ఉన్న చిన్న వ్యాపార సంస్థలు, సముదాయాలు, పెద్ద వ్యాపార సంస్థలు మధ్యాహ్నం వరకు సంపూర్ణబంద్ను పాటించి ఆ తరువాత ఆయా సంస్థల వినియోగదారుల తాకిడితో పాక్షికంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాయి.
బీసీ సంఘాలు..ప్రజాసంఘాలతో కదంతొక్కిన గులాబీలు
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని బీఆర్ఎస్ పార్టీ బంద్ సందర్భంగా ఆయా వర్గాలకు వివరించే ప్రయత్నం చేసింది. రాజ్యాంగ బద్ధంగా, చట్టపరిధిలో చేయాల్సిన ప్రక్రియలు చేయకుండా బీసీ సమాజానికి కాంగ్రెస్ అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా గులాబీ శ్రేణులు వివరించే ప్రయత్నం చేశారు. బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలుపుకొని గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు ర్యాలీలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో పార్టీ అనుబంధ బీసీ సెల్ మాత్రమే కాకుండా అన్ని అనుబంధ సంఘాలు పూర్తిస్థాయిలో పాల్గొని ఉద్యమస్ఫూర్తిని చాటాయి.
2018లో కేసీఆర్ హయాంలో చేసిన 34 శాతం రిజర్వేషన్ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులే న్యాయస్థానాలకు వెళ్లి ఎలా అడ్డుకట్టవేశారో వివరించే ప్రయత్నం చేశారు. మరోవైపు రాజ్యాంగ పరిధిలో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తమచిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చర్యను విస్మరించడంపై బీసీ వర్గాలు మండిపడ్డాయి. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన కాంగ్రె స్, బీజేపీలే రోడ్డు మీదికి రావటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని స్థాయిల్లో ప్రజలు బీసీ సంఘాలకు సంఘీభావం ప్రకటిస్తూ ఐక్యకార్యాచరణ సమితి (జాక్) ఇచ్చిన పిలుపులో సంపూర్ణభాగస్వాములు అవుతుం టే, తామెక్కడ వెనకబడిపోతామోననే భయంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా బంద్ సందర్భంగా ర్యాలీల్లో పాల్గొన్నా రు. బీసీ బంద్‌తో ఆర్టీసీకి సుమా రు రూ.కోటి వరకు ఆదాయం తగ్గినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ డీ విజయభాను తెలిపారు. బస్సులన్నీ హనుమకొండ బస్‌స్టేషన్‌కే పరిమితయ్యాయి.
బీసీ సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ సంపత్‌పై కాంగ్రెస్ దాడి
జనగామ చౌరస్తా : జనగామ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన బీసీ బంద్ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ సేవెల్లి సంపత్ మీడియాతో మాట్లాడుతుండగా అతడిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్లరి మూకలు దాడి చేశాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితుడు, బీసీ సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘కామారెడ్డి బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాయమాటలు చెప్పి బీసీల ఓట్లు దండుకున్నారని’ మీడియాతో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులు చింతకింది మల్లేశ్, లొక్కుంట్ల ప్రవీణ్ తదితరులు అడ్డు తగిలారు.
సంపత్ ఎడమ భుజంపై చేతులు వేసి వెనక్కి నెట్టివేశారు. మూకుమ్మడిగా సంపత్‌పై దాడి చేసే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న జేఏసీ నాయకుడు మంగళంపల్లి రాజుతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సంపత్‌కు అడ్డుగా నిలబడి దాడి జరగకుండా నిలువరించారు. అనంతరం సంపత్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్న అన్యాయం, మోసాలపై ప్రశ్నిస్తే తట్టుకోలేని కొందరు కాంగ్రెస్ అల్లరి మూకలు భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ఇలాంటి పనికిమాలిన, అప్రజాస్వామిక చర్యలకు బీసీ బిడ్డలెవరూ భయపడరని హెచ్చరించారు.
మహిళపై కాంగ్రెస్ నాయకుల దాడి
మరిపెడ : 42 శాతం రిజర్వేషన్ కోసం శనివారం బీసీ సంఘాలు చేపట్టిన బంద్ మరిపెడ మండల కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది. మండలకేంద్రంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా తమ షాపులను బంద్ చేయగా, ఓ షాపు యజమానురాలు తమ షాపును మూసివేయలేదు. దీంతో అక్కడికి చేరుకున్న కొందరు కాంగ్రెస్ నాయకులు ఇంకా ఎందుకు షాపు మూసివేయలేదని ఆమె గొడవకు దిగారు. అనుచితంగా ప్రవర్తించారు. ఆమెపై చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడి ఉద్రిక్తత చోటు చేసుకున్నది.
దాడికి గురైన మహిళ బీజేపీ పట్టణ అధ్యక్షుడి భార్య కావడంతో వాతావరణం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించిన తీరును అక్కడున్న కొంతమంది వ్యాపారులు తప్పుబడుతూ ఆమెకు మద్దతుగా నిలిచారు. స్థానిక విశ్రాంతి భవనం ఎదురుగా ఖమ్మం, వరంగల్ ఎన్‌హెచ్-365పై నిరసనకు దిగారు. దీంతో సుమారు అరగంటకుపై ట్రాఫిక్ జామ్ అయింది. సీఐ రాజ్‌కుమార్ గౌడ్, ఎస్సై కోటేశ్వరావు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. అనంతరం బాధిత మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై కోటేశ్వరావు తెలిపారు.
తొర్రూరులో ఉద్రిక్తత
తొర్రూరు: బీసీ బంద్‌లో భాగంగా తొర్రూరు పట్టణంలోని పాలకేంద్రం నుంచి అంబేదర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాకు చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ‘ఇదేమి రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం’ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. సమయానికి పోలీసులు జోక్యం చేసుకొని ఉద్రిక్తత అదుపులోకి తెచ్చారు. దాదాపు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
బీసీలకు చట్టపరంగా 42శాతం రిజర్వేషన్ కల్పించాలి
వేలేరు/ ధర్మసాగర్, అక్టోబర్ 18 : బీసీలకు చట్టపరంగా 42శాతం రిజర్వేషన్ కల్పించాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య డిమాండ్ చేశారు. శనివారం వేలేరు మండలం మల్లికుదుర్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో, ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో చేపట్టిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాజయ్య మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన రేవంత్‌రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీని ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే ఏకగ్రీవంగా అన్నీ పార్టీలు మద్దుతునిచ్చినట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు.
ఈ రెండు పార్టీలు దొందూదొందె అన్నట్లు వ్యవహరిస్తున్నాయని, నువ్వు కొట్టినట్టు చేస్తే నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లు వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే తెలంగాణలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు, 8మంది కాంగ్రెస్ ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే మోదీ బీసీ బిల్లు పెట్టాడానికి అవకాశం ఉంటుదన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చనందుకు, హైకోర్టులో జీవో9కు స్టే వచ్చినందుకు రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకపోయి జంతర్‌మంతర్ దగ్గర ధర్నా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, ధర్మసాగర్ మండల ఇన్చార్జి కర్ర సోమిరెడ్డి, నాయకులు మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజు, మహేందర్, రవీందర్, ఎండీ హరీఫ్, ఎల్లయ్య పాల్గొన్నారు.