ఉమ్మడి జిల్లా వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. జిల్లాకో మెడికల్ కళాశాల కల నెరవేరిన సంబురం అంబరాన్నంటింది. జనగామ, జయశంకర్ జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాల తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించగా, స్థానికంగా వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తీసిన భారీ ర్యాలీలతో రెండు పట్టణాలు హోరెత్తాయి. జనగామలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జయశంకర్ జిల్లాలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీ అధ్యక్షులు గండ్ర జ్యోతి, పాగాల సంపత్‌రెడ్డి, జక్కు శ్రీహర్షిణి, పుట్ట మధు, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ కృషితో వైద్య విద్య చేరువ కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జనగామ/జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) :జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వైద్య కళాశాలల ప్రారంభోత్సవాలు శుక్రవారం అంబరాన్నంటాయి. రాష్ట్రంలో తొమ్మిది చోట్ల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించగా జనగామలో మంత్రి ఎర్రబెల్లి, భూపాలపల్లిలో మంత్రి సత్యవతిరాథోడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఆయాచోట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీలు తీశారు. జిల్లా కేంద్రాల్లోనే వైద్య కళాశాలలు ప్రారంభమై, వైద్య విద్య చెంతకు చేరడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జనగామ చంపక్‌హిల్స్‌లో సందడి
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొన్నది. తెల్లకోటు, స్టెతస్కోప్‌తో హాజరైన విద్యార్థులు, వారి వెంట తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు, బంధుమిత్రులతో చంపక్‌హిల్స్ వద్ద సందడి నెలకొన్నది. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో చౌరస్తా నుంచి చంపక్‌హిల్స్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చంపక్‌హిల్స్‌లోని ఎంసీహెచ్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ తరగతులను హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ 12.36 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించిన వెంటనే ప్రజలు జయజయధ్వనాలతో పెద్దఎత్తున స్వాగతం పలికారు. ‘కేసీఆర్ జిందాబాద్’.. ‘బీఆర్ఎస్ జిందాబాద్’, ‘దేశ్‌కీనేత కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకలో మంత్రితో పాటు, ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యే టీ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏడవెల్లి కృష్ణారెడ్డి, మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు జమున, సిద్ధిలింగం పాల్గొన్నారు.
జయశంకర్ జిల్లా కేంద్రంలో కోలాహలం
జయశంకర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ వేడుకలు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భూపాలపల్లిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ తీశారు. మంత్రి సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ సెంటర్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ప్రతి జిల్లా ఓ మెడికల్ హబ్..
వైద్య విద్య కళాశాలలతో ప్రతి జిల్లా ఓ మెడికల్ హబ్‌గా మారుతున్నది. ప్రజలకు కార్పొరేట్ తరహా ఉచిత వైద్యం, విలువైన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి తప్పనుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. మంత్రి ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి చొరవతో జనగామ, జయశంకర్ జిల్లాలకు మెడికల్ కళాశాలలు రావడంపై ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త కాలేజీల వల్లే సీటు వచ్చింది
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : మాది వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం చౌటపల్లి. మాకు ఊళ్లో ఎలాంటి భూమి జాగ లేదు. నాన్న కౌలు రైతు. నన్ను చదివించేందుకు చాలా కష్టపడ్డాడు. డాక్టర్ కావాలన్నది నా కోరిక. అందుకే నన్ను డాక్టర్‌ను చేయాలని శాయశక్తులా కృషిచేశాడు. నేను 10వ తరగతి వరకు వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలలో చదివాను. హనుమకొండలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ రాశాను. చాలా కష్టపడి చదివాను కానీ సీటు వస్తుందో రాదో అనుకున్నా. సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్యను ఊహించని విధంగా పెంచారు. వైద్య విద్య చదవాలంటే ఇతర రాష్ర్టాలు, దేశాలు వెళ్లాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ తెలంగాణలో ఇప్పటికే 21 ప్రభుత్వ కాలేజీలను కేసీఆర్ ఏర్పాటు చేయడం వల్ల నాకు సీటు దొరుకుతుందనే నమ్మకం కలిగింది. ప్రైవేటులో చదివే స్థోమత లేదు. నేను ఊహించినట్లుగానే తెలంగాణలోనే అది కూడా మా ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. సీఎం కేసీఆర్ తెలంగాణలో కళాశాలలను విస్తరించకపోతే నాకు సీటు దొరికేది కాదు. నాలాగే చాలామందికి అవకాశం దక్కింది.
– ఈ.సాయికిరణ్, పర్వతగిరి, వరంగల్ జిల్లా, విద్యార్థి
చాలా సంతోషంగా ఉంది..
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : మాది హనుమకొండ జిల్లా ఉప్పల్. కమలాపూర్ మండలం. గ్రామంలో మాది చిన్నపాటి కిరాణం షాపు. వచ్చిన ఆదాయంతో పాటు నా భర్త శ్రీనివాస్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొడుకు ప్రవీణ్‌ను కష్టపడి చదివించాం. మా కొడుకును ఎలాగైనా డాక్టర్ని చేయాలని మా కోరిక. ప్రభుత్వ కళాశాలలో సీటు వస్తేనే చదివించాలని అనుకున్నాం. మాకు ప్రైవేట్‌లో చదివించే స్థోమత లేదు. సీఎం కేసీఆర్ తెలంగాణలో కొత్తగా మెడికల్ కళాశాలను ఏర్పాటుచేయడంతో సీట్ల సంఖ్య పెరిగింది. మా కుమారుడికి తప్పకుండా సీటు వస్తుందని అనుకున్నాం. మేము ఊహించినట్లుగానే భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటం.
– చల్లూరి లావణ్య, విద్యార్థి తల్లి, ఉప్పల్, హనుమకొండ జిల్లా,
పేదలకు సేవ చేస్తా..
నర్మెట, సెప్టెంబర్ 15 : సీఎం కేసీఆర్ జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయ డం వల్ల నా కల నెరవేరబోతు న్నది. నాకు చిన్నప్పటి నుంచి పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలని కోరిక. అందు కోసమే కష్టపడి చదివాను. జిల్లాలో వంద మందికి మెడి కల్ సీట్లు అందించిన సీఎం కేసీ ఆర్ చాలా గ్రేట్. మాది హనుమకొండ. మా నాన్న రాజిరెడ్డి ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్. నేను ఉన్నత స్థాయికి చేరుకోవాలనేదే వారి కోరిక. నేను కష్టపడి మెడిసిన్‌లో ప్రతిభ కనబరిచి మా తల్లిదండ్రులతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తా.
– కట్కూరి సాత్వికారెడ్డి, వైద్య విద్యార్థి, జనగామ
మైనార్టీలను గుర్తించిన ప్రభుత్వం
నర్మెట, సెప్టెంబర్ 15 : మాది మహబూబ్‌నగర్. మైనార్టీలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాలకు మైనార్టీ గురుకులాలను ఏర్పా టు చేసింది. మా కూతురు మైమునఅప్సా మహబూబ్‌నగర్ ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతిలో 2020లో జిల్లాలోనే మొదటి ర్యాంకు సాధించింది. రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు తగిన గుర్తింపు దక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మైనార్టీ పాఠశాలలను స్థాపించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది. ప్రైవేట్ కాలేజీల్లో సీటు కోసం సుమారు రూ.50లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఉచితంగా వైద్య విద్య అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు మేమంతా రుణపడి ఉంటం.
– ఎండీ షఫీ, వైద్య విద్యార్థి తండ్రి, మహబూబ్‌నగర్
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
నర్మెట, సెప్టెంబర్ 15: మాది మధ్యతరగతి కుటుంబం. మెడిసిన్ చేయాలంటే ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటంది. కానీ సీఎం కేసీఆర్ జిల్లాకు ఓ వైద్య కళాశాల ఏర్పాటు చేయడం వల్ల మాకు సీటు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మా నాన్న చంద్రప్రసాద్ హనుమకొండ జిల్లా కాజీపేటలో బుక్‌స్టాల్ నడిపిస్తారు. అమ్మ చందన ఇంటి వద్దే ఉంటారు. చెల్లెలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకపోతే చాలా కష్టమయ్యేది ప్రైవేట్‌లో మెడిసిన్ చదివే స్థోమత లేదు. ఎలాంటి ఖర్చు లేకుండా వైద్య విద్యను అందిస్తున్నారు.
– రామ సాయిసంజన, జనగామ వైద్య విద్యార్థి
కాలేజీలు పెరగడం వల్లే ఎక్కువ మందికి అవకాశం
నర్మెట, సెప్టెంబర్ 15 : తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి వైద్య విద్యను చేరువ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చదివించాల్సి వస్తే ఆర్థికంగా చాలా కష్టంగా ఉండేది. వైద్యవిధానంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి స్థానికులకు 85శాతం సీట్లు కేటాయించడం వల్ల ఎంతో లబ్ధిచేకూరింది.
– రామ చంద్రప్రసాద్, వైద్య విద్యార్థి తండ్రి