రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యాన కమలాపూర్‌లో అభివృద్ధి పండుగ కొనసాగింది. మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల బాలికలు, బాలుర విద్యాలయాలు, కేజీబీవీ విద్యాలయం, జూనియర్ కళాశాల అత్యాధునిక భవనాలను మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో కలిసి మంత్రి రామన్న మంగళవారం ప్రారంభించగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. అంతకుముందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, వారితో కాసేపు ముచ్చటించారు. కమలాపూర్‌కు తొలిసారి వచ్చిన అమాత్యునికి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో ఆడబిడ్డలు బోనాలు, మంగళహారతులతో తరలివచ్చి రామన్నకు వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు.
కమలాపూర్, జనవరి 31: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కమలాపూర్ మండలకేంద్రంలో మంగళవారం సుమారు మూడు గంటల సేపు పర్యటించారు. ఉదయం 11.55 గంటలకు హెలికాప్టర్లో వచ్చిన ఆయన హెలీప్యాడ్ వద్ద దిగి తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్తుండగా ముదిరాజ్, పద్మశాలీ, గౌడ, ఎస్సీ కులస్థులు, మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. వాహనంపై సుమారు రెండు కిలోమీటర్లు కొనసాగిన ర్యాలీలో దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు రామన్నపై పూలవర్షం కురిపించారు. గులాబీ జెండాలు చేతబట్టి.. పెద్ద సంఖ్యలో బైక్‌లతో ర్యాలీ తీసి ‘సీఎం, సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.కోటీ 50లక్షలతో జర్నలిస్టుల డబుల్ బెడ్ రూం ఇండ్లు, రూ.కోటీ 71లక్షలతో ఆర్టీసీ బస్టాండ్, రూ.25లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.25లక్షలతో అయ్యప్ప దేవాలయం, రూ.30లక్షలతో పెద్దమ్మ గుడి, రూ.30లక్షలతో మార్కండేయ ఆలయం, గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.69.85లక్షలతో నిర్మించిన కులసంఘాల భవనాలను రైతువేదిక ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం ఎంజేపీ బాలికల విద్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌కు విద్యార్థులు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. రూ.20కోట్లతో మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్సియల్ స్కూల్, రూ.19 కోట్లతో మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలుర రెసిడెన్సియల్ స్కూల్, రూ.2.05 కోట్లతో కేజీబీవీ విద్యాలయం, రూ.2.50 కోట్లతో నిర్మించిన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నూతన భవనాలను ఎంజేపీ బాలికల విద్యాలయంలో ప్రారంభించారు. బాలికల స్కూల్లో క్లాసులను, లైబ్రరీని పరిశీలించారు. ఆరో తరగతి డిజిటల్ క్లాసుల నిర్వహణ తీరును వీక్షించారు. అక్కడ విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. బాలురు, బాలికలతో సహపంక్తి భోజనం చేశారు. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయించాలని కోరిన పిల్లలకు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష్యంతో ముందుకు సాగాలని, బాగా చదువుకోవాలని సూచించారు. దాదాపు మూడు గంటలకుపైగా కమలాపూర్‌లో గడిపిన కేటీఆర్, రోడ్డు మార్గంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట బహిరంగ సభకు వెళ్లారు. పర్యటన ఆద్యంతం అడుగడుగునా ప్రజలను, పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఓపికగా మాట్లాడుతూ ముందుకు సాగారు. పలువురు మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలు దిగి మురిసిపోయారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, హనుమకొండ జడ్పీ అధ్యక్షుడు సుధీర్‌కుమార్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ఆర్జీ హన్మంతు, పోలీస్ కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ లు అంకతి సాంబయ్య, కట్కూరి విజయ, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ కల్యాణి, సింగిల్‌విండో చైర్మన్ సంపత్‌రావు, డైరెక్టర్ సత్యనారాయణరావు, ఆర్డీవో వాసుచంద్ర, ఎంపీడీవో పల్లవి, తహసీల్దార్ రాణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
హిందూ ధర్మాన్ని కాపాడుతున్నదని అర్చకులేనని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అర్చకులకు సమున్నత గౌరవం ఇచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో దేవాలయాల అభివృద్ధి, అర్చక, బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. కమలాపూర్‌లో అర్చక ఉద్యోగ జాక్ కొత్త డైరీని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, తెలంగాణ అర్చక జాక్ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అట్టడుగున ఉన్న అర్చక వ్యవస్థను కాపాడి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అర్చక సంఘాల నాయకులు ప్రణవ్, భరత్‌కుమార్, రమేశ్ జంగమ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.