apco | పోచమ్మమైదాన్, మే 16 : తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో ద్వారా ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ రా్రష్ట్రం కొనుగోలు చేయగా వాటి బకాయిలు చెల్లించేందుకు మాత్రం అక్కడి అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొనుగోలు చేసిన కార్పెట్లకు ఇవ్వాలని కోట్లాది రూపాయలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయా సంఘాల అధ్యక్షులు ఆందోళన చెందుతున్నారు. ఏడాదిన్నర గడుస్తున్నా బకాయిలు ఇవ్వడంలో చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నారు. వాటి కోసం ప్రతి రెండు, మూడు నెలలకోకసారి ఏపీలోని విజయవాడకు వెళ్లి అధికారులను కలుస్తున్నా పట్టించుకోవడం లేదంటూ చెబుతున్నారు.
ఆంధ్రా చేనేత ఉత్పత్తులకు బకాయిలు చెల్లిస్తూ తెలంగాణ చేనేత సంఘాలపై వివక్ష చూపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వరంగల్ కొత్తవాడలోని షతరంజి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు యెలుగం సాంబయ్య, విశాలక్షి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అడిగొప్పుల సంపత్, వీర హనుమాన్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు యెలుగం ఓం ప్రకాశ్‌తో పాటు పలు సంఘాల అధ్యక్షులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఓరుగల్లు ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్
చేనేత ఉత్పత్తులకు నిలయమైన ఓరుగల్లులో తయారు చేసిన కార్పెట్లు, బెడ్షీట్లకు అంతర్జాతీయస్థాయిలో డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆప్కో ద్వారా కార్పెట్లు కొనుగోలు చేసి, ఏపీలోని ప్రభుత్వ హాస్టళ్లల్లో విద్యార్థులకు అందచేయాలని నిర్ణయించింది. ఈమేరకు డిసెంబర్ 2021, మే 2022 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఆప్కో ద్వారా నేత ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 23 చేనేత సహకార సంఘాలు, కరీంనగర్ జిల్లాలోని 3 చేనేత సహకార సంఘాల నుంచి రూ.4కోట్ల 60లక్షల కార్పెట్లను కొనుగోలు చేశారు.
మూడు నెలల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పి, అక్కడినుంచి వచ్చిన అధికారులు కార్పెట్లను తీసుకువెళ్లారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.2కోట్ల 50లక్షల విలువైన బ్లాంకెట్లను కొనుగోలు చేశారు. అయితే ఈ సంఘాలకు సంబంధించిన బకాయిలు చెల్లింపులో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కోట్లాది రూపాయల చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. అధికారుల తీరుతో పలు సంఘాల అధ్యక్షులు ఆర్థికంగా నిలదొక్కుకోలేక చతికిలపడుతున్నారు. దీంతో తాము సంఘాలను అభివృద్ధి చేయలేక, నేత కార్మికులకు చేతినిండా పని కల్పించలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు.
ఏపీకి వెళ్లి నిరాశతో వచ్చాం..
ప్రతి సంఘానికి లక్షల్లో బకాయిలు చె ల్లించాల్సి ఉంది. మొత్తంగా 6 కోట్ల రూపాయల దాకా రావాల్సి ఉంది. చాలాసార్లు ఆప్కో అధికారులను కలవడానికి విజయవాడకు వెళ్లి వచ్చాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎనిమిది సంఘాల అధ్యక్షులం కలిసి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ తిరిగి వస్తున్నాం. ప్రతిసారీ ఆప్కో అధికారులను నేరుగా కలిసినా ఫలితం ఉండడం లేదు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సునీతను కూడా కలిసి మా గోడు చెప్పుకొన్నం. అయినా అధికారుల్లో ఎలాంటి కదలిక లేదు. గతంలో వరంగల్‌లో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం అక్కడ ఆప్కోకు ఎండీగా ఉన్నప్పటికీ మా సమస్య తీరడం లేదు. ఏవేవో కారణాలు చెబుతూ తెలంగాణ సంఘాలపై వివక్ష చూపుతున్నారు.
– యెలుగం సాంబయ్య, షతరంజి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు
మూడు నెలలకే ఇస్తామన్నరు..
మూడు నెలలకే ఇస్తామన్న బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అదే ఆంధ్రాలో అయితే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో ఆప్కో అధికారులు కొనుగోలు చేసిన చేనేత ఉత్పత్తులకు బకాయిలు చెల్లించారు. తెలంగాణ సంఘాలపై మాత్రం వారు వివక్ష చూపుతూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారు. టెస్కోతో పాటు ఆప్కో ద్వారా కొనుగోళ్లు పెరగడం వల్ల సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని భావిస్తే, బకాయిలు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నాం. ఆంధ్రా అధికారులు తెలంగాణ పట్ల ఆశ్రద్ధ్ద చేస్తూ, చిన్నచూపు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని, మా బకాయిలు మాకు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– అడిగొప్పుల సంపత్, విశాలాక్షి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు