వరంగల్, జనవరి 28 (నమస్తేతెలంగాణ) : వరంగల్ కాశీబుగ్గలోని నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గుడిబడి) విద్యారంగంలో ప్రత్యేకతను చాటుతున్నది. తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తెచ్చి పోటీ ప్రపంచంలో నిలబడి గెలుస్తున్నది. అత్యధిక మంది విద్యార్థులతో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సర్కారు స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నరేంద్రనగర్ ఉన్నత పాఠశాల విజయగాథ తెరపైకి వచ్చింది. ఇక్కడ చదువుకునేందుకు విద్యార్థులకు అడ్మిషన్ దొరకలేని పరిస్థితి ఉండడం ఇపుడు చర్చనీయాంశమైంది. మొదట ఓ గుడిలోని గదుల్లో ఈ స్కూలు ప్రారంభమైంది. తర్వాత పక్కనే సొంత భవనాలను సమకూర్చుకుంది. అందుకే దీన్ని స్థానికులు గుడిబడి అంటారు. ఈ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని స్థానికుల్లో విశ్వాసం పెరిగింది. ఇక్కడి ఉపాధ్యాయులు కూడా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.
ముందుచూపుతో ఆంగ్లమాధ్యమం
ఆంగ్ల మాధ్యమానికి ఆదరణ పెరుగుతుండడంతో నరేంద్రనగర్ పాఠశాల ఉపాధ్యాయులు ముందుచూపుతో పదిహేనేళ్ల క్రితమే ఇంగ్లిష్ మీడియం బోధనకు ప్రతిపాదించారు. స్థానికుల నుంచి సహకారం లభించడంతో 2006లో అమల్లోకి తెచ్చారు. ఈ స్కూలులో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉంటే మొదట ఆరో తరగతిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ఆరో తరగతి విద్యార్థులను తెలుగు, ఇంగ్లిష్ మీడియం సెక్షన్లుగా విభజించి బోధన నిర్వహించారు. ఇలా సంవత్సరానికో తరగతికి విస్తరిస్తూ పదో తరగతి వరకు అమల్లోకి తెచ్చారు. క్రమంగా ప్రతి తరగతిలోనూ ఇంగ్లిష్ మీడియం సెక్షన్లు పెంచారు. ప్రస్తుతం ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతిలో మూడేసి సెక్షన్లు ఉంటే వీటిలో ప్రతి తరగతిలోనూ ఒక సెక్షన్ తెలుగు, రెండు సెక్షన్లు ఇంగ్లిష్ మీడియం ఉన్నాయి. పదో తరగతిలో నాలుగు సెక్షన్లు ఉండగా వీటిలో ఒకటి తెలుగు, మూడు ఇంగ్లిష్ మీడియం కావడం విశేషం. తెలుగు మీడియం సెక్షన్ల కంటే ఇంగ్లిష్ మీడియం సెక్షన్లలోనే ఎక్కువ మంది ఉన్నారు. ఈ హైస్కూల్లో ప్రస్తుతం 879మంది విద్యార్థులు చదువుతున్నారు. వరంగల్ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఏ ఒక్క స్కూల్లోనూ ఇంతమంది లేరు. జీ ప్లస్ టు భవనంతో కూడిన కాంప్లెక్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రభుత్వ ప్రాథమిక, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో ఉన్నత పాఠశాల పనిచేస్తున్నది. ఆకర్షణీయమైన పెయింటింగ్స్‌తో ఈ స్కూల్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాలలో లైబ్రరీ, డిజిటల్ ల్యాబ్‌లు ఉన్నాయి.
ఇంగ్లిష్ మీడియంతోనే మార్పు
పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ప్రస్తుతం ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధన అవసరం. మా స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలోనే 879మంది విద్యార్థులున్నారు. తెలుగు మీడియం మాత్రమే ఉంటే విద్యార్థుల సంఖ్య ఇంత ఉండేది కాదు. ఇంగ్లిష్ మీడియం లేని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. ఒక్కో స్కూలులో 30 నుంచి 50 మంది విద్యార్థులే ఉంటున్నారు. ఇంగ్లిష్ మీడియం అమల్లోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లన్నీ బలోపేతమవుతాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం చాలా సంతోషాన్నిచ్చింది.
దాతల సహకారం
పాఠశాల బలోపేతానికి స్థానిక దాతలు తమ వంతు సహకారం అందించారు. ఇటీవల ఓ ఎన్ఆర్ఐ ఈ స్కూల్‌కు 50 డ్యుయల్ డెస్కులు, 19 గోడ గడియారాలను విరాళంగా ఇచ్చారు. ఇద్దరు దాతలు వాష్‌రూమ్, ఒకరు స్టేజీ నిర్మిస్తే, ఒకరు ప్రొజెక్టర్ అందించారు. ఓ స్వచ్ఛంద సంస్థ కొన్ని కుర్చీలు, టేబుళ్లు, డస్ట్బిన్లు, మరో సంస్థ టీవీని సమకూర్చింది. చదువులో ప్రోత్సహించేందుకు పదో తరగతిలో ప్రతిభ చూపిన స్కూల్ విద్యార్థులకు దాతలు ఏటా నగదు ప్రదానం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన కాశీబుగ్గ పూర్వవిద్యార్థి ఒకరు రెండేళ్లు నుంచి ఏటా రూ.20వేల చొప్పున నగదు బహుమతి ఇస్తున్నారు.
అద్భుత ఫలితాలు
నాణ్యమైన బోధనతో నరేంద్రనగర్ ఉన్నత పాఠశాలలో ఏటా అద్భుత ఫలితాలు వస్తున్నాయి. పదో తరగతి విద్యార్థుల్లో కొందరు బాసర ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల్లోనూ సీట్లు సంపాదిస్తున్నారు. 2019 ఫలితాల్లో మరే ఉన్నత పాఠశాలలో లేని విధంగా ఇక్కడి నలుగురు విద్యార్థులు టెన్ బై టెన్ జీపీఏ సాధించారు. అదే ఏడాది ఎనిమిది మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ పొందారు. 2020లో ఇద్దరు, 2021లో మరో ఇద్దరు ఆడ్మిషన్ పొందారు. ఇక్కడ చదువుకున్న వారిలో పలువురు విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. కాశీబుగ్గ ప్రాంతం నుంచేకాకుండా వరంగల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో తీవ్ర పోటీ ఏర్పడి అందరికీ అడ్మిషన్ దొరకని పరిస్థితి నెలకొంది. ఉత్తమ సేవలతో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కే రవికుమార్ సహా ఉపాధ్యాయులు అందరి మన్ననలు పొందుతున్నారు.