నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 24,905 మంది ఓటర్లతో కూడిన జాబితాను కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గత అక్టోబర్ ఆరంభం నుంచే ఓటర్ల నమోదుకు షెడ్యూల్‌ను విడుదల చేశారు.
దీని ప్రకారం గత నెల 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈమేరకు నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లా ల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం లేని దరఖాస్తులను తిరస్కరించారు. గత నెల 23న మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. దీనిపైనా తిరిగి అభ్యంతరాలను స్వీకరిస్తూ ఇదే సమయంలో కొత్తగా దరఖాస్తులకు అనుమతించారు. దీంతో కొత్త గా 2,351 మంది ఓటర్లు పెరిగారు. అనంతరం తుది జాబితాను సిద్ధం చేసి సోమవారం ప్రకటించారు.
మొత్తం 12 జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 24,905గా నమోదైంది. అందులో పురుషులు 14,940 మంది, మహిళలు 9,965మంది ఉన్నారు. 2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈసారి అదనంగా 4,017 మంది నమోదు చేసుకున్నారు. ఈ తుది జాబితా ఆధారంగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసి మార్చిలో పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి టీఎస్ యూటీఎఫ్‌కు చెందిన అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సన్నద్ధవుతున్నది. ఇక పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా గతంలో 181 ఉండగా, ఈసారి 200కి పెరిగింది. అదనంగా 19 పోలింగ్ కేంద్రాలు రానున్నాయి. కాగా, ఇప్పటికే ప్రధాన సంఘాల నుంచి అభ్యర్థులు ఖరారయ్యారు. టీఎస్ యూటీఎఫ్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మరోసారి అభ్యర్థిగా ప్రచారంలోకి దిగారు. పీఆర్టీయూ నుంచి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, టీచర్స్ జాక్ పేరుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మరో సంఘం నుంచి హర్షవర్ధన్‌రెడ్డి ఓటర్లను కలుస్తున్నారు. తుది జాబితా వెల్లడి కావడంతో మరింత ముమ్మరం ప్రచారం చేసేందుకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.