గోవిందరావుపేట, అక్టోబర్ 26 : ప్రకృతి అందాలకు మారుపేరుగా నిలిచిన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సులో పర్యాటకుల సౌకర్యార్థం అధికారులు మ రో ఐలాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా ‘దికోవ్’ పేరుతో నూతన రిసార్టును ఏర్పాటు చేశారు.
అద్భుతమైన సౌకర్యాలతో పర్యాటకులకు వసతితో పాటు పసందైన భోజనం, వాటర్ స్పోర్ట్స్ , అడ్వెంచర్స్ గేమ్స్ వంటి సౌకర్యాలతో పాటు ఐదు స్విమ్మింగ్ పూల్స్, 22 ప్రీమియం రూమ్‌లను నిర్మించారు. 50 మంది సామర్థ్యంతో అధునాతనమైన రెస్టారెంట్‌ను సైతం ఏర్పాటు చేశారు. సరస్సు కట్టమీది నుంచి కాకరకాయల బోర్డు తీగల వంతెన మీదుగా చేరుకున్న అనంతరం 2వ ఐలాండ్‌కు పర్యాటకులను చేర్చేందుకు నూతన బోట్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నూతనంగా నిర్మించిన తీగల వంతెన మీదుగా 3వ ఐలాండ్‌కు చేరుకునే ఏర్పాట్లు చేశారు.
అందమైన ప్రకృతికి తోడు చుట్టూ నీళ్లు, బోటు షికారు, ఐలాండ్‌లో వసతితో పాటు చిన్నారులు, పెద్దల కోసం నాలుగు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఐలాండ్‌లో ఉన్న రూములకు అనుసంధానంగా మరో పెద్ద స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు. కేరళ, లక్షద్వీప్, బాలీలాంటి పర్యాటక ప్రాంతాలను పోలిన విధంగా పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫ్రీకౌట్స్ సంస్థ ‘దికోవ్’ పేరుతో రిసార్టును లీజ్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
పర్యాటకులను ఆకర్షించేలా 3వ ఐలాండ్‌లో అధికారులు ఏర్పాట్లు చేశారు. పర్యావరణ హిత టూరిజంగా అభివృద్ధి చేసే దిశగా ‘దికోవ్’ రిసార్ట్ ముస్తాబైంది. స్విమ్మింగ్ పూల్స్, జిప్‌లైన్ వంటి అడ్వెంచర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్, క్యాంపెయిన్‌తో పాటు నూతన శోభతో మినీ బీచ్ ఏర్పాటు చేశారు. పర్యాటకులు సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించేందుకు వీలుగా వ్యూ పాయింట్‌ను తీర్చిదిద్దారు. పర్యాటకులు సరదాగా చేపలను వేటాడేందుకు సౌకర్యాలు కల్పించారు. అలాగే సైక్లింగ్ బోటింగ్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పార్టీలు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు లక్నవరం రిసార్ట్ నూతన ఆకర్షణగా మారనున్నది.