స్వచ్ఛతలో సిరిపురం ఆదర్శంగా నిలిచింది. ఏకగ్రీవ పంచాయతీని స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 అవార్డు వరించింది. ప్రభుత్వం అందించిన పల్లె ప్రగతి కార్యక్రమ నిధులను సద్వినియోగం చేసుకుంటూ, అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషికి దక్కింది. గ్రామంలో పారిశుధ్య నిర్వహ ణ, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు, కిచెన్ గార్డెన్స్‌తో పాటు 10 కమ్యూనిటీ మ్యాజిక్ సోక్పిట్స్ ఏర్పాటు, తడి పొడి చెత్తతో ఎరువు తయారీ చేస్తూ ఇతర గ్రామాలకు స్ఫూర్తినిస్తోంది. ఈ నేపథ్యంలో 2వేలలోపు జనాభా గల కేటగిరీలో సిరిపురం రాష్ట్రస్థ్ధాయి అవార్డుకు ఎంపికైంది. గురువారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న టీఎస్ఐఆర్డీలో అవార్డును అందుకోనుంది.
స్వచ్ఛత, అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామాలకు యేటా కేంద్రప్రభుత్వం జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డులను ప్రకటిస్తోంది. రెండు వేలలోపు, 2 వేల నుంచి 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు వీటిని అందజేస్తోంది. 2వేలలోపు జనాభా గల కేటగిరీలో సిరిపురం రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపికైంది. గతేడాది నెల్లుట్ల పంచాయతీ జాతీయ అవార్డు సాధించగా.. ఈ సారి 2వేల లోపు జనాభా ఉన్న సిరిపురాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారుచేయాలని కలెక్టర్ శివలింగయ్య గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామంలో 398 ఇళ్లు, 1990 మంది జనాభా, 1520 మంది ఓటర్లు ఉండగా, ప్రతి వార్డుకు జిల్లాస్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్దేశాయి, డీఆర్డీ రాంరెడ్డి అక్కడే తిష్ట వేసి పర్యవేక్షించారు. కలెక్టర్ గ్రామాన్ని సందర్శిస్తూ తగు సలహాలు, సూచనలు అందించారు. మండలంలోని 21మంది పంచాయతీ కార్యదర్శులు, 16 మంది ఫీల్డు అసిస్టెంట్లు భాగస్వాములయ్యారు.
వార్డుల వారీగా..
1వవార్డుకు జడ్పీ సీఈవో వసంత, 2వ వార్డుకు డీఏవో వినోద్, 3వ వార్డుకు సీపీవో ఇస్మాయిల్, 4వ వార్డుకు డీడబ్ల్యూవో జయంతి, 5వవార్డుకు డీఐవో(ఇరిగేషన్)శ్రీనివాస్, 6వవార్డుకు డీహెచ్‌ఎస్‌వో (హార్టికల్చర్) లత, 7వవార్డుకు ఈఈపీఆర్ చంద్రశేఖర్, 8వవార్డుకు డీఎస్వో రోజారాణిలను ఇన్చా ర్జులుగా కలెక్టర్ నియమించారు. ఆయా వార్డుల్లో ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రతి మరుగు దొడ్డికి రెండు గుంతలు తవ్వించి వై జంక్షన్లను ఏర్పాటు చేయించారు. మొదటి గోతిలో నిండిన మురుగు రైతులకు ఎరువుగా మారుతుంది. మురుగును ఎత్తిపోసే సమస్య తలెత్తదు. నీరు వృథా కాకుండా ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు తవ్వించారు.ప్రభుత్వ కార్యాలయాల్లో స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను నిర్మించారు. కిచెన్గార్డెన్స్తోపాటు గ్రామంలో 10 కమ్యూనిటీ మ్యాజిక్ సోక్పిట్స్ను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇంకుడు గుంతల ఏర్పాట్లు నూరు శాతం పూర్తి చేశారు. గ్రామంలో నాలుగు చోట్ల ప్లాస్టిక్ సేకరణ యూనిట్లను ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ రహిత గ్రామం గా తీర్చిదిద్దారు. మురుగు నీటి యాజమాన్య పద్ధతులు, తడి, పొడి చెత్త ద్వారాఎరువులను తయా రు చేస్తూ సంపద వనరులుగా మార్చారు. ఈ నేపథ్యంలో సిరిపురం గ్రామం 2వేలలోపు జనాభా గల కేటగిరిలో రాష్ట్రస్థ్ధాయి అవార్డును దక్కించుకుంది. ఈ నెల 14న అవార్డును అందుకోనుండగా, జాతీయ అవార్డును అందుకునేందుకు ముందు వరుసలో ఉంది. తమ సమష్టి కృషికి ఫలి తం దక్కిందని, అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తుండగా, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అవార్డు రావడం సంతోషం
జిల్లా, మండల స్థ్ధాయి అధికారులు ఎప్పటికప్పుడు అందించే సూచనలు, సలహాలు పాటిస్తూ శ్రమించా. సమస్యల పరిష్కారానికి సిబ్బందితో కలిసి పనిచేశా. గ్రామంలోని 398 ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, వై జంక్షన్ల ఏర్పాటుకు నా వంతు కష్టపడ్డా. అవార్డు రావడం సంతోషంగా ఉంది.
-బొట్ల శంకర్, పంచాయతీ కార్యదర్శి
గ్రామాభివృద్ధే ధ్యేయం
ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామాభివృద్ధే ధ్యేయంగా శ్రమిస్తున్నా. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే తపనతో కృషి చేసి ఫలితం సాధించా. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని నాలుగు చోట్ల ప్లాస్టిక్ సేకరణ యూనిట్లను ఏర్పాటు చేశా. నెల్లుట్లకు జాతీయ అవార్డు రావడంతో మా గ్రామాన్ని ఆ స్థ్ధాయిలో నిలపాలని తపించా. అధికారులు, వార్డుసభ్యులు, ప్రజలు పార్టీలకతీతంగా సహాయ సహకారాలు అందించారు.
-మర్రి లక్ష్మీభాస్కర్రెడ్డి, సర్పంచ్
సమష్టి కృషి వల్లే..
అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో సిరిపురం గ్రామానికి రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. ప్రతి రోజూ గ్రామంలో 21 మంది పంచాయతీ కార్యదర్శులు, 16 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామస్తులను చైతన్యపరిచారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకత, ఇంకుడుగుంతల ప్రాధాన్యత, వై జంక్షన్ల ఏర్పాట్లపై అవగాహన కలిగించడంతో ఇది సాధ్యమైంది.
– సురేందర్‌నాయక్, ఎంపీడీవో, లింగాలఘనపురం