దంతాలపల్లి : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల నుంచి విద్యార్థి పారిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన హస్తం మంజు చరణ్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం తెల్లవారుజామున పాఠశాల గోడదూకి విద్యార్థి పారిపోయినట్లు తెలిసింది.
పాఠశాల నుంచి విద్యార్థి పారిపోవడం పట్ల ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని గుర్తించి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులపై ఎంతో నమ్మకంతో హాస్టల్లో విద్యార్థులను ఉంచుతూ చదివిస్తుంటే వారి నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు పాఠశాలల నుంచి పారిపోతున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.