వరంగల్, మే 26 : బల్దియా అధికారుల రూటే సప‘రేట్’ అన్నట్లు ఉన్నది. ఒకే పనికి వేర్వేరుగా ధరలు నిర్ణయించడం వారికే చెల్లుతున్నది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) టెండర్లలో తేడాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో కొన్నేళ్లుగా వీధి కుక్కలను పట్టి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి తిరిగి తీసుకొచ్చిన ప్రాంతాల్లోనే వదిలేసే ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. గతంలో గ్రేటర్ కార్పొరేషన్ పరిధి అంతా ఒకే ఏజెన్సీకి ఉండగా, ఇటీవల వరంగల్, హనుమకొండ ప్రాంతాలను వేరు చేశారు.
గతంలో హనుమకొండను స్వతంత్ర ఏజెన్సీకి ఇవ్వగా, వరంగల్‌ను ‘పీపుల్స్ ఫర్ ఎనిమల్’ అనే సంస్థకు ఇచ్చారు. అయితే రెండు ప్రాంతాల్లో చేసే పని ఒకటే అయినా కొత్త ఏజెన్సీకి ఒక కుక్కకు రూ. 1650 చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. హనుమకొండలో పని చేస్తున్న ఏజెన్సీకి మాత్రం కుక్కకు రూ. 1280 చెల్లిస్తున్నారు. అయితే కొత్త ఏజెన్సీకి రూ.370 అధికంగా చెల్లించడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ విధానంతో బల్దియా ఖజానాకు చిల్లు పడుతోంది.
నగరంలో సుమారు 29వేల వీధి కుక్కలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గ్రేటర్ వరంగల్ పరిధిలోని సగం డివిజన్లు హనుమకొండలో, మరో సగం డివిజన్లు వరంగల్ ప్రాంతంలో ఉంటాయి. ఒకే కార్పొరేషన్లో ఒకే పనికి రెండు ఏజెన్సీలకు వేర్వేరు రేట్లు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏబీసీ టెండర్లలో రేట్ల తేడాపై బల్దియా అధికారులను ప్రశ్నిస్తే సమాధానాన్ని దాటవేస్తున్నారు. ‘ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్ పిలిచాం. మూడు టెండర్లలో రూ.1650 తక్కువ కోట్ చేసిన పీపుల్స్ ఫర్ ఎనిమల్ ఏజెన్సీని ఫైనల్ చేశామని’ చెప్పడం గమనార్హం.
నేడు ఏబీసీ కమిటీ సమావేశం
ఎనిమల్ బర్త్ కంట్రోల్ కమిటీ సమావేశం బుధవారం బల్దియా కార్యాలయంలో జరగనుంది. డీఎంహెచ్‌వో, బల్దియా సీఎంహెచ్వో, జిల్లా వెటర్నిటీ అధికారి, ఇద్దరు వెటర్నిటీ డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధితో కూడిన కమిటీ నగరంలోని కుక్కలు, కోతుల సమస్య నివారణ, వీధి కుక్కల కుటుం బ నియంత్రణ చేసే ఏజెన్సీల పని విధానంపై చర్చించనుంది.