నల్లబెల్లి, ఏప్రిల్ 16 : గత రాత్రి ఉరుములు మెరుపులతో వీచిన గాలులతో కూడిన అకాల వర్షానికి మండలంలో అపారంగా నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా మండలంలోని అనేక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కల్లాల్లో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసి ముద్దయ్యాయి. రోడ్లకు అడ్డంగా భారీ వృక్షాలు నేలకూలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అంది వచ్చినట్టే వచ్చి గాలి దుమారం వానలతో తీవ్ర నష్టం వాటిళ్లిందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తడిసిన ధాన్యాన్ని పంటలను సంబంధిత అధికారులు పరిశీలించి ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గాలి దుమారానికి రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలు గత రాత్రంతా అంధకారంలో గడిపారు.