సుబేదారి/మహబూబాబాద్ రూరల్/శాయంపేట, సెప్టెంబర్ 25 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు శాఖ అందించిన ఉత్తమ సేవలకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేశ్‌భగవత్ వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో రాష్ట్రస్థాయి ఉత్తమ విచారణ అధికారిగా శాయంపేట స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ్నాయక్ ఎంపికయ్యారు.
బాధితుల నుంచి మర్యాదపూర్వకంగా ఫిర్యాదులు తీసుకోవడం, సమస్యలను పరిషరించడం, థర్డ్ పార్టీకి సమాచారం అందించడంలో అతడి సేవలను గుర్తించి ప్రశంసాపత్రం అందజేశారు. 6 నెలల క్రితం వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా చేతుల మీదుగా బెస్ట్ స్టేషన్ ఇన్చార్జి అవార్డునూ వెంకట్రామ్నాయక్ అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను పలువురు అభినందించారు. అలాగే ఆత్మకూరు సీఐ సంతోష్, చిల్పూరు, మానుకోట రూరల్ ఎస్సైలు రాజేందర్, దీపిక బెస్ట్ అవార్డులు అందుకున్నారు.