హనుమకొండ చౌరస్తా, జనవరి 19 : సరికొత్త ఆలోచనలు.. నూతన ఆవిష్కరణలకు నిట్ వేదికగా నిలిచింది. టెక్నోజియాన్-24(ఇన్జీనియస్) వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే ఈ టెక్నోజియాన్లో శనివారం ఇంజినీరింగ్ విద్యార్థులు సుమారు 40 టెక్నికల్ ఈవెంట్లు ప్రదర్శించనున్నారు. టెక్నోజియాన్ ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థుల ఎగ్జిబిట్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టైం డిటెక్షన్ అలారం, రోబోటిక్ బాస్కెట్బాల్ గేమ్, మెటల్ గ్రాబింగ్ డివైజ్, ఆటోమెటిక్ డ్రైనేజీ క్లీనింగ్ సిస్టమ్, స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. స్టాక్ మారెట్ ట్రేడింగ్లో విద్యార్థులకు అనుభవాన్ని అందించడానికి ట్రేడింగ్ పిట్ నిర్వహించారు. ఎకువ డబ్బు సంపాదించిన విద్యార్థులను విజేతలుగా ప్రకటిస్తారు. అలాగే ఆర్బిస్, క్రాక్ ది క్వెరీ, ఇన్నోచెమ్, క్రియేటివ్ రోబోటిక్స్ ప్రదర్శించారు.
టెక్నోజియాన్ ముఖ్యమైన లెర్నింగ్ ప్లేస్ అని నిట్ ఇన్చార్జి డైరెక్టర్, రిసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డీన్ ప్రొఫెసర్ వీటీ సోమశేఖర్ అన్నారు. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య, స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ ప్రెసిడెంట్ హరికృష్ణ, ఫ్యాకల్టీ అడ్వైజర్ హరిప్రసాద్రెడ్డి సమక్షంలో సోమశేఖర్ జ్యోతిప్రజ్వలన చేసి టెక్నోజియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్నోజియాన్ గ్రాండ్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.