గిరిజన తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. గిరిజనులు తమను తాము పాలించుకునే అవకాశం కల్పించింది. సర్కారు చొరవతో చాలామంది గిరిజన బిడ్డలు వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లుగా ఎన్నికై తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్టీ జీపీలకు సొంత భవనాల కోసం నిధులు కేటాయించింది. ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున జిల్లాలోని 59 జీపీలకు రూ.11.80 కోట్లు విడుదల చేసింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సాధ్యమైనంత త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించి సదరు ఎస్టీ గ్రామ పంచాయతీల కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. జీపీ కార్యాలయాల భవనాలకు నిధులు మంజూరు కావడంతో గిరిజనులు సంబురపడుతున్నారు.
వరంగల్, ఫిబ్రవరి 11(నమస్తేతెలంగాణ) : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన గిరిజన తండాలు, గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది. తమ తండాలు, గూడేలను తామే పాలించుకునే అవకాశాన్ని గిరిజనులకు కల్పించింది. దీంతో ఈ గ్రామ పంచాయతీల్లో గిరిజన బిడ్డలు సర్పంచులు అయ్యారు. తమ తండాలు, గూడేలను అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. తండాలు, గూడేల పంచాయతీ కార్యాలయాల కోసం సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక్కో ఎస్టీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 లక్షలు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,216 ఎస్టీ గ్రామ పంచాయతీలకు రూ.243 కోట్లు మంజూరు చేసింది. వీటిలో జిల్లాలో పది మండలాల్లో 59 ఎస్టీ గ్రామ పంచాయతీలకు రూ.11.80 కోట్లు కేటాయించింది.
అత్యధికంగా చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో పన్నెండేసి ఎస్టీ గ్రామాలకు నిధులు మంజూరయ్యాయి. నిధులు మంజూరైన 59 ఎస్టీ గ్రామ పంచాయతీల్లో ఖానాపురం మండలంలోని బద్రుతండా, బోటిమామిడితండా, కీర్యతండా, కొడ్తిమాటుతండా, నాజీతండా, వేపచెట్టుతండా, చిలుకమ్మతండా, నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్తండా, అవుసలతండా, గొల్లభామతండా, సూర్యపేటతండా, కాలనాయక్‌తండా, తోపనగడ్డతండా, హమ్రుతండా, దర్మతండ, పుల్లబోయినతండా, జీడిగడ్డతండా, పదహారుచింతలతండా, చెరువుకొమ్ముతండా, దుగ్గొండి మండలంలోని రజినితండా(గోబ్రియతండా), పీజీతండా ఉన్నాయి.
నర్సంపేట మండలంలోని ముత్యాలమ్మతండా, భోజ్యానాయక్‌తండా, పర్శనాయక్‌తండా, రాములునాయక్‌తండా, ఇప్పల్‌తండా, నెక్కొండ మండలంలోని రెడ్యానాయక్‌తండా, లావుడ్యాతండా, మూడుతండా, చెరువుముందరితండా, అమీరమాంగ్యతండా, హరిచంద్‌తండా, నక్కలగుట్టతండా, నెక్కొండతండా, వెంకనాయక్తండా, పిట్టలబోడుతండా, మహబూబ్నాయక్తండా, రామన్నకుంటతండా, వర్దన్నపేట మండలంలోని రాందాన్తండా, పర్వతగిరి మండలంలోని మంగ్యతండా, బత్తుతండా,-2, హట్యాతండా, ముంజలకుంటతండా, గోరుగుట్టతండా, రాయపర్తి మండలంలోని వాంకుడోతుతండా, పన్యనాయక్తండా, జింకురాంతండా, ఎర్రకుంటతండా, గణేశ్కుంటతండా, పనిష్తండా, ఓల్నాయక్తండ, అవుసలకుంటతండ, సంగెం మండలంలోని పెద్దతండ, బిక్కోజినాయక్తండా, వీఆర్ఎన్తండా, బాలునాయక్తండా ఉన్నాయి. గతంలో వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న ఈ తండాలు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఆవిర్భవించాయి. వీటికి గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్వహణ కోసం సొంత భవనాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. కాగా, జీపీలకు సొంత భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరవడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే సొంత భవనాలు రాబోతున్నాయని మురిసిపోతున్నారు.