సుబేదారి/కమలాపూర్, ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గోతికాడి నక్కలు ఎలా కాచుక్కూర్చున్నాయో ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మంగళవారం ఉదయం పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం బయటకు వచ్చిందన్న విషయం కలకలం రేపగా ఈ వ్యవహారం వెనుక ‘కమలం’ కుట్రలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఆకతాయి కమలాపూర్ ప్రభుత్వ పాఠశాల ఎగ్జామ్ సెంటర్లో చెట్టు ఎక్కి మొదటి అంతస్తుకు వెళ్లి గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థి ప్రశ్న పత్రాన్ని కిటికీలోంచి తీసుకొని దాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో షేర్ చేయగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడు బూరం ప్రశాంత్, ప్రశ్న పత్రాన్ని మరిన్ని గ్రూపుల్లోకి పంపి బీఆర్ఎస్ సర్కారుపై బురదజల్లే ప్రయత్నం చేసినట్లు తేలింది. మొత్తానికి కొన్ని గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు, ఈ ఘటనలో మైనర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మంగళవారం ఉద యం పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం బయటకు వ చ్చిందన్న విషయం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెను క ‘కమలం’ కుట్రలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఓ మైనర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి అత్యంత సన్నిహితుడిని, మరో నిందితుడిని కమలాపూర్ పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కమలాపూర్‌కు చెందిన మైనర్, ఇదే గ్రామానికి చెందిన మౌటం శివ గణేశ్, హసన్‌పర్తి మండలం ఆరేపల్లికి చెందిన బూరం ప్రశాంత్ (బండి సంజయ్ సన్నిహితుడు) ఉన్నారు.
కొన్ని గంటల్లోనే ఛేదించిన పోలీసులు
మంగళవారం ఉదయం 10 గంటల తర్వాత పదో తరగతి హిందీ పేపర్ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. పదో తరగతి రెండో పేపర్ కూడా లీక్ అయిందనే వార్తలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా కమలాపూర్ మండలం ఉప్పల్‌లోని కేంద్రం నుంచి పేపర్ బయటకు వచ్చిందని ప్రచారం కాగా, కమలాపూర్ పోలీసులు, రెవెన్యూ అధికారులు, విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేసి ఈ ఘటన కమలాపూర్ మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో జరిగినట్లు తెలుసుకొని, నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
వివరాలు వెల్లడించిన సీపీ
కేసు వివరాలను సీపీ రంగనాథ్ మంగళవారం రాత్రి విలేకరులకు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ మైనర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం హిందీ పరీక్ష జరుగుతున్న సమయంలో కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల వెనుక భాగంలోని ప్రహరీ పకనే ఉన్న చెట్టు సాయంతో మొదటి అంతస్తులోకి ఎక్కిన ఓ మైనర్, మూడో నంబర్ గదిలో పరీక్ష రాస్తున్న బాలుడి నుంచి ఉదయం 9.45 గంటలకు హిందీ పరీక్ష పత్రాన్ని తీసుకొని దానిని ఫొటో తీశాడు. తర్వాత మరో నిందితుడైన మౌటం శివగణేశ్‌కు వాట్సాప్ ద్వారా పంపాడు. శివగణేశ్ ఉదయం 9.59 గంటలకు వాట్సాప్‌లో షేర్ చేయగా, మూడో నిందితుడు బూరం ప్రశాంత్ మరిన్ని గ్రూపులకు పంపాడు. ఇలా చాలా గ్రూపుల్లో హిందీ ప్రశ్నా పత్రం చక్కర్లు కొట్టడంతో విషయం బయటకు తెలిసింది. పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు సైబర్ విభాగం, స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను గుర్తించారు. కొన్ని గంటల్లోనే కేసును ఛేదించిన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఏసీపీ తిరుమల్, సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి, కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, కమలాపూర్ ఎస్ఐలు చరణ్, సతీశ్, హసన్‌పర్తి ఎస్ఐలు విజయ్, సతీశ్, సైబర్ క్రైమ్ విభాగం ఏఏవో ప్రశాంత్, కానిస్టేబుళ్లు కిషోర్, రాజు, ఆంజనేయులును సీపీ అభినందించారు.