నల్లగొండ ప్రతినిధి, మార్చి 3(నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ అభ్యర్ధి పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆది నుంచి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ తొలి ప్రాధాన్యతలో 1,215 ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచి ఎలిమినేషన్ రౌండ్లోనూ స్పష్టమైన మెజార్టీ సాధించి మొత్తం 13,969 ఓట్లతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. రెండో స్థానంలో యూటీఎఫ్ బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నిలిచారు.
నల్లగొండలోని ఐటీహబ్ వెనకాల ఉన్న గోదాముల్లో ఉదయం 8 గంటల నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ హాల్‌కు తరలించారు. ఒక్కో టేబుల్‌కు 8 బాక్స్‌ల చొప్పున మొత్తం 25 టేబుళ్లపై 25 చొప్పున బ్యాలెట్ పత్రాలు కట్టలు కట్టే కార్యక్రమం పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి ఒక్కో టేబుల్‌కు వేయి బ్యాలెట్ పేపర్ల చొప్పున తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 19 మంది అభ్యర్థులకు పోలైన ఓట్లను వారికి కేటాయించిన బాక్స్‌లో వేశారు. చెల్లని ఓట్లను కూడా ఇదే సమయంలో కౌంటింగ్ ఏజెంట్ల అనుమతితో ప్రత్యేక బాక్స్‌లో వేశారు. మధ్యాహ్నం 3.30గంటల సమయంలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వివరాలను అభ్యర్ధుల వారీగా రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు.
1,215 ఓట్ల ఆధిక్యంలో శ్రీపాల్‌రెడ్డి
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసే సరికి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి 1,215 ఓట్ల ఆధిక్యత సాధించారు. మొత్తం పోలైన 24,135 ఓట్లలో 494 చెల్లనివిగా తేల్చారు. తొలి ప్రాధాన్యతలో శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు, యూటీఎఫ్ నర్సిరెడ్డికి 4,820, హర్షవర్ధన్‌రెడ్డికి 4,437, పూల రవీందర్‌కు 3,115, సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజు యాదవ్‌కు 2,040 ఓట్లు వచ్చాయి. కొలిపాక వెంకటస్వామికి 421 ఓట్లు రాగా మిగతా వారు డబుల్ డిజిట్ దాటలేదు. చిలుక చంద్రశేఖర్‌కు కేవలం ఒకే ఓటు పోల్ కావడం గమనార్హం.
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిశాక చెల్లని ఓట్లను పక్కన పెట్టి, మిగిలిన 23,641 ఓట్లలో 50 శాతం ప్లస్ ఒకటి కలిపి మొత్తం 11,821 ఓట్లను గెలుపు కోటాగా నిర్ధారించారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ అన్ని ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ రౌండ్‌ను ప్రారంభించారు. అతి తక్కువగా తొలి ప్రాధాన్యత వచ్చిన అభ్యర్థులను కింద నుంచి ఎలిమినేట్ చేస్తూ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. చివరిదైన నర్సిరెడ్డి ఎలిమినేషన్ రౌండ్ ముగిసే సరికి శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రావడంతో ఆయనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి విజేతగా ప్రకటించారు. దీంతో పీఆర్టీయూటీఎస్ నేతలు, శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.
శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు
పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి మొత్తం 13,969 ఓట్లు సాధించారు. గెలుపు కోటా 11,821 ఓట్లు కాగా అంతకుమించి 2,148 ఓట్లతో భారీ విజయం సాధించారు. రెండో స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎలిమినేషన్ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డి గెలుపు కోటాను అధిగమించి ముందుకువెళ్లారు. ఈ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డి 2,870 ఓట్లు సాధించారు. అంతకుముందు హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 2వేల ఓట్లు పోల్ అయ్యాయి. ఇక్కడే శ్రీపాల్‌రెడ్డి గెలుపు కోటాకు మరో 722 ఓట్ల దూరంలో నిలిచారు. దాంతో రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డిని కూడా ఎలిమినేట్ చేస్తూ లెక్కింపు కొనసాగించారు. కాగా ఈ ఎన్నికల్లో 9,672 మంది రెండో ప్రాధాన్యత ఓటు వేయకపోవడం విశేషం.