వరంగల్ చౌరస్తా : ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్(Warangal) నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా(Second capital) ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం వరంగల్లోని శివనగర్ సీపీఐ కార్యాలయం తమ్మెర భవన్లో తాళ్లపల్లి రహేలా అధ్యక్షతన జరిగిన సీసీఐ జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల విషయం ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనుకకు అన్న రీతిలో అమలవుతున్నాయని విమర్శించారు.
తక్షణం అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందించాలని, పంటల బీమా పథకం, కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పింఛన్ల పెంపు లాంటి హామీల అమలుకు తక్షణం పూనుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీల అమలు ఇలానే కొనసాగిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉన్నదని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచుతూ చేసిన హామీ, ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్న నేపథ్యంలో ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు.
పేదలందరికీ రేషన్ కార్డులు లేకపోవడం, పలు సాంకేతిక కారణాల నేపథ్యంలో హామీలు అమలుకు నోచుకోవడంలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ కె బాష్ మియా, పనాస ప్రసాద్, నాయకులు బుస్సా రవీందర్, గన్నారపు రమేష్, తదితరులు పాల్గొన్నారు.