గీసుగొండ, మార్చి 11: కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవాన్ని శనివారం రాత్రి కనులపండువగా నిర్వహించారు. అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్రస్వామి వారికి నిత్యవిధి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రాత్రి 9 గంటలకు స్వామి వారిని ఆలయ ఫౌండర్ శ్రీనివాసాచార్యులు, కమిటీ చైర్మన్ గడ్డమీది కుమారస్వామి, ఈవో శేషగిరి ఆధ్వర్యంలో భక్తుల కోలాహలం నడుమ పల్లకీలో గుట్టపై నుంచి ఉత్సవమూర్తులను కిందకు తీసుకొచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని రథం ఎదుట స్వామి వారిని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అర్చకులు రథానికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి స్వామి వారిని రథంపైకి చేర్చారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని గుట్టచుట్టూ లాగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గీసుగొండ సీఐ సట్ల రాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.