సాగులో వ్యయం తగ్గించుకునే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. ఈ కోవలోనే వరి పంటలో వెదజల్లే పద్ధతి విస్తరిస్తున్నది. కూలీలు దొరకని పరిస్థితుల్లో వారి అవసరం లేకుండానే సాగు చేస్తున్నారు. పెట్టుబడి తగ్గడంతోపాటు ముందుగానే కోతకు వస్తుండడంతో అన్నదాతలు వెదజల్లే సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే శాయంపేట మండలంలో సుమారు వెయ్యి ఎకరాలకుపైగానే ఈ విధానంలో సాగయ్యింది.
– శాయంపేట, ఆగస్టు 11
రైతులు వెదజల్లే పద్ధతిలో వరిని సాగు చేస్తూ పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడమే కాకుండా కూలీల కొరతను అధిగమిస్తున్నారు. శాయంపేట మండలంలో ఖరీఫ్‌లో ఆరు వేల ఎకరాలకుపైగా సాగు చేస్తున్నారు. యాసంగిలో పూర్తిస్థాయిలో వెదజల్లే పద్ధతిలో రైతులు వరి సాగు చేయగా, పత్తిపాక, శాయంపేట, నేరేడుపల్లి, ప్రగతిసింగారం, కొప్పుల, సూరంపేట, గట్లకానిపర్తి తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఎకరాకు నాటు వేసే పద్ధతిలో ఒక బస్తా(30) కిలోల విత్తనాలకు సుమారు రూ. 1200 అవుతుండగా, అదే వెదజల్లే పద్ధతిలో కేవలం 12 కిలోలు అంటే రూ.400 వరకు ఖర్చవుతోంది. ఎకరాకు నాట్లు వేసేందుకు సుమారు 12 మంది కూలీలు అవసరం కాగా, ఒక్కొక్కరికి రూ.300 చొప్పున రూ.3600 వ్యయం అవుతోంది. నారు పోసేందుకూ ఖర్చవుతున్నది. ఈ ఇబ్బందులేమీ లేకుండా వెదజల్లే పద్ధతిలో రైతులే మొలకొచ్చిన విత్తనాలను పొలంలో కొన్ని గంటల్లోనే చల్లుతున్నారు. దుక్కి దున్ని, గొర్రు కొట్టి నాటు వేసేందుకు నీళ్లు ఉంచుతారు. వెదజల్లే పద్ధతిలో మాత్రం బురదగా ఉంటేనే విత్తనాలు జల్లుతున్నారు.
దీంతో నీళ్ల వాడకం కూడా తక్కువగానే ఉంటున్నదని రైతులు చెబుతున్నారు. శారీరక శ్రమ కూడా తక్కువగా ఉండడంతో అన్నదాతలు వరిలో వెదజల్లే సాగుకు మక్కువ చూపుతున్నారు. మధ్యలో బాటలు తీస్తూ సమానంగా విత్తనాలు వెదజల్లుతుండడంతో పిలకలు ఆరోగ్యంగా ఉంటాయ ని, చీడపీడల నుంచి రక్షణ లభించి దిగుబడి మెరుగయ్యేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో వెదజల్లే సాగుపై వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరముందని రైతులు కోరుతున్నారు.