కురవి(సీరోలు), మార్చి 29 : ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతుండగా తండ్రిని నెట్టివేసి, మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల రాజు, రాధిక దంపతుల కొడుకు రేపాల బిక్షపతి(22) డిగ్రీ పూర్తి చేశాడు. అయితే, రాజు, రాధిక ఈ నెల 16న కురవి మండలం సూదనపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మ కార్యక్రమమానికి వెళ్లారు.
అలాగే, అక్కడి నుంచి చిన్నగూడూరులోని బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి గత ఆదివారం వెళ్లారు. రాత్రి కావొస్తుండడంతో ఇంటికి వెళ్దామని ఇంట్లో కొడుకు ఒకడే ఉన్నాడని భార్యతో రాజు గొడవపడ్డాడు. దీంతో ఇద్దరు అదే రాత్రి కాంపల్లికి చేరుకున్నారు. ఇంటికొచ్చిన తర్వాత కూడా భార్యభర్తలు గొడవపడుతున్న క్రమంలో అమ్మను ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించగా తండ్రికి, కొడుకు భిక్షపతికి మాటమాట పెరిగింది.
దీంతో తండ్రి రాజును భిక్షపతి అనుకోకుండా నెట్టడంతో గోడకు తగిలి కిందపడ్డాడు. మనస్తాపం చెందిన భిక్షపతి రాత్రి గడ్డి మందు తాగి బయటే నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున భిక్షపతి వాంతులు చేసుకుంటుండగా తల్లిదండ్రులు గమనించి మహబూబాబాద్‌లోని దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్సపొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీరోలు ఎస్సై నగేశ్ తెలిపారు. కాగా, ఒకగానొక కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.