హనుమకొండ, ఏప్రిల్ 15 : ‘నవ్వి పోవుదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది లంచాలకు మరిగిన కొందరు అధికారుల తీరు. ఏసీబీ అధికారులు దాడులు చేసి, అవినీతి బాగోతాన్ని బయటపెట్టినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ప్రజలకు పారదర్శక సేవలు అందించాల్సిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండేళ్ల కాలంలో ఆరుగురు అధికారులు ఏసీబీకి చిక్కడం.., కోట్ల రూపాయల నగదు, అక్రమ ఆస్తులు, పత్రాలు బయటపడడం చూస్తుంటే ఆ శాఖలో ఏ స్థాయిలో అవినీతి జరుగుతున్నదో అర్ధమవుతున్నది.
భూముల రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల నమోదు వంటి కీలక సేవలందించే ఈ శాఖలో కొంతమంది అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ శాఖ ప్రతిష్ఠ మసకబారే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులు ఈ ఆరోపణలకు బలాన్ని ఇస్తున్నాయి. సంవత్సరన్నర కాలంలో నలుగురు అధికారులు అవినీతి ఆరోపణలతో ఏసీబీకి చిక్కారు. అయినా, శాఖలో అక్రమాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా, మరో ఇద్దరు అధికారులు ఏసీబీ దాడుల్లో పట్టుబడటం సంచలనంగా మారింది. ప్రజల పనులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, లంచాలు డిమాండ్ చేయడం, డాక్యుమెంట్ల నమోదు కోసం నిర్ధిష్ట రుసుముకు మించి డబ్బులు వసూలు చేయడం ఈ శాఖలో నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భూముల విలువలు పెరుగుతున్నాయో లేదోకాని, కొంతమంది రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్ల అక్రమ ఆస్తులు మాత్రం కోట్లు, లక్షల్లో పెరుగుతున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తులతో కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు కుమ్మకై దర్జాగా అక్రమ దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలను ముందుగా డాక్యుమెంట్ రైటర్ల వద్దకు మళ్లించి, అకడే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు, డాక్యుమెంట్ రైటర్లకు మధ్య ఉన్న ఒప్పందంతో ఈ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్లపై పెన్సిల్‌తో ప్రత్యేక కోడ్ వేసి సబ్ రిజిస్ట్రార్‌కు పంపిస్తే, ఆయన దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారనే పలువురు బాహటంగానే చర్చించుకుంటున్నారు. అయితే, ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఏసీబీ తనిఖీల్లో ఒకేసారి 20 మంది డాక్యుమెంట్ రైటర్లు పట్టుబడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. అనుమతి లేకుండా డాక్యుమెంట్లు తయారు చేయడం, నిబంధనలు ఉల్లంఘించడం, అధిక ఫీజులు వసూలు చేయడం వంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆఫీసుల్లో ఉండే ప్రైవేట్ వ్యక్తులు, బయట ఉండే డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ల చీకటి దందా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ప్రజలు నేరుగా కాకుండా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా రిజిస్ట్రేషన్‌కు వెళ్లేడంతో అధికారుల అక్రమ సంపాదన సులువుగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. నేరుగా క్రయ, విక్రయదారులు వెళ్లితే ఏవేవో కారణాలు చూపుతూ సబ్రిజిస్ట్రార్లు వెనుకకు పంపుతారని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డాక్యుమెంట్ రైటర్లను కలువాల్సి వస్తుందని పలువురు బాధితులు తెలపడం కొసమెరుపు. అయితే, ఏసీబీ అధికారులు తరచూ దాడులు చేస్తున్నా ఆ శాఖలో కొంతమంది అధికారుల తీరులో ఏమాత్రం మార్పు కనిపించకపోవడం విచారకరం. దాడులు జరిగిన కొద్ది రోజులకే మళ్లీ అధికారులు తమ చీకటి దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని కార్యాలయాల్లో లంచం ఇవ్వకపోతే ఫైళ్లు ముందుకు కదలవని పలువురు బాధితులు చెబుతున్నారు. అంతేకాక, కొంతమంది అధికారులు తమకు రాజకీయ అండదండలున్నాయని నిర్భయంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
రెండేళ్లలో ఆరుగురు అధికారులు..
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత సంవత్సరన్నర కాలంలో వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగిన ఏసీబీ దాడుల్లో ఆరుగురు అధికారులు చిక్కారు. కోట్ల రూపాయల నగదు, అక్రమ ఆస్తులు, పత్రాలు బయటపడ్డాయి. 2024 మార్చి 23వతేదీన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఎండీ. తస్లీమా రూ.40వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే విధంగా 2024 జులై 25న పరకాల సబ్‌రిజిస్ట్రార్ కే సునీత రూ.80వేలు, 2025 ఫిబ్రవరి 23న స్టేషన్‌ఘన్‌పుర్ సబ్‌రిజిస్ట్రార్ రూ.18వేలు లంచం తీసుకుంటూ దొరికారు. భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆకస్మిక తనీఖిలు నిర్వహించినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల ఒకటవ తేదీన హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరు సబ్ రిజిస్ట్రాల అవినీతి అక్రమాల వ్యవహారం బయటకు వచ్చింది. వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.